Cm kcr praja deevena sabhaగతేడాది ఏప్రిల్‌లో జరిగిన నాగార్జునసాగర్ ఉపఎన్నిక నేపథ్యంలోనూ రెండు నెలలు ముందుగా కృతజ్ఞతాసభ పేరుతో అధికార తెరాస హాలియాలో సీఎం సభను ఏర్పాటు చేసింది. ఉపఎన్నిక నవంబరులో ఉంటుందనే అంచనాల నేపథ్యంలో ఇప్పుడూ అదే మాదిరిగానే పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయడంతో నియోజకవర్గానికి హామీల వర్షం కురిపిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి రహదారి మార్గంలో భారీ కాన్వాయ్‌తో మధ్యాహ్నం రెండు గంటలకు మునుగోడుకు చేరుకోనున్న ముఖ్యమంత్రి అక్కడే మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటూ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్యనేతలతో సమావేశమవుతారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. మరోవైపు ఈ సభలోనే పార్టీ తరఫున ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది.
అయితే దీనిపై పార్టీ వర్గాల నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థిత్వం పట్ల తెరాస అధిష్ఠానం మొగ్గు చూపుతుందనే వార్తల నేపథ్యంలో అన్ని మండలాల్లోనూ అసమ్మతి నేతలు ఇప్పటికే వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. దీంతో ఈ సభ అనంతరం నియోజకవర్గంలోని సర్పంచిలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేసి అందరి నుంచి అభిప్రాయ సేకరణ చేసి ఆ తర్వాతనే అభ్యర్థిపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ ముఖ్య నేత ఒకరు ఈటీవీభారత్‌కు వెల్లడించారు.