తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యాచరణ వెనక మహాత్మా జ్యోతిబా ఫూలే వంటి దార్శనికుల స్ఫూర్తి ఇమిడి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఆదివారం ఫూలే 195వ జయంతి సందర్భంగా సీఎం నివాళులు అర్పించారు. దేశానికి ఫూలే అందించిన సేవలను స్మరించుకున్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా, సమ సమాజం కోసం పోరాడిన బహుజన తత్త్వవేత్త, సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిబా ఫూలే అని కేసీఆర్ అభివర్ణించారు.
వర్ణ వివక్షను రూపుమాపేందుకు, దళిత, బహుజన మహిళా వర్గాల అభ్యున్నతి కోసం ఫూలే ఆచరించిన కార్యాచరణ మహోన్నతమైందని సీఎం వ్యాఖ్యానించారు. ఆరున్నరేళ్ల తెలంగాణ స్వయం పాలనా ప్రక్రియ ఫూలే వంటి మహనీయుల స్ఫూర్తితోనే కొనసాగుతోందన్న సీఎం.. కుల వృత్తులకు సామాజిక గౌరవం, ఆర్థిక గౌరవాన్ని పెంపొందించేలా అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. విద్య, సమానత్వం ద్వారానే సామాజిక, ఆర్థిక సమున్నతికి బాటలు పడతాయన్న ఫూలే ఆలోచనా విధానాన్నే తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తోందని వివరించారు.