CM KCR Pays Tribute to Kaikala : నటుడు కైకాల సత్యనారాయణ విలక్షణమైన నటనా శైలితో పేరు ప్రఖ్యాతలు సాధించారని సీఎం కేసీఆర్ అన్నారు. హీరోలకు దీటుగా రాణించారని కొనియాడారు. ఫిల్మ్ నగర్‌లోని కైకాల సత్యనారాయణ నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం సత్యనారాయణ భౌతికకాయానికి సీఎం కేసీఆర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌లు ఉన్నారు.
ఈ సందర్భంగా కైకాల సత్యనారాయణకు ఏ పాత్ర ఇచ్చినా అద్భుతంగా పోషించేవారని, హీరోలకు దీటుగా రాణించారని సీఎం కేసీఆర్ కొనియాడారు. సత్యనారాయణ ఎంపీగా ఉన్నప్పుడు ఆయనతో అనేక అనుభవాలు పంచుకున్నామని గుర్తు చేసుకున్నారు. ఆయనతో కలిసి కూడా పని చేశానని సీఎం స్మరించుకున్నారు. ఆయన లేని లోటు తెలుగు చిత్ర పరిశ్రమకు తీరనిదని, సత్యనారాయణకు సాటి ఎవరూ రారన్నారు.