తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో 15 రోజులపాటు స్వాతంత్ర్య వేడుకలు.. దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా కార్యక్రమాలు

cm-kcr-ordered-the-officials-to-organize-75th-independence-day-celebrations-in-the-state-for-15-days
cm-kcr-ordered-the-officials-to-organize-75th-independence-day-celebrations-in-the-state-for-15-days

By

Published : Jul 23, 2022, 8:48 PM IST

Updated : Jul 23, 2022, 9:31 PM IST

20:24 July 23

ఆగస్టు 15కు ముందు 7రోజులు, తర్వాత 7 రోజులు కార్యక్రమాలు

Independence Day Celebrations: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో 15 రోజుల పాటు వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 15 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం వేడుకల నిర్వహణపై ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న వేళ.. స్వాతంత్ర్య సమరయోధులు, మహనీయుల త్యాగాలు, పోరాట ఫలాలు నేటి తరానికి అర్థమయ్యేలా... దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు రూపొందించాలని సీఎం నిర్ణయించారు. గడప గడపకూ, వాడ వాడనా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని... క్రీడా, వక్తృత్వ, వ్యాసరచన పోటీలు, కవిసమ్మేళనాలు, జాతీయ భావాలు రగలించే సాంస్క్రతిక కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

స్వాతంత్ర్య దినోత్సవం రోజైన ఆగస్టు 15కు ముందు 7 రోజులు, తర్వాత 7 రోజులు.. మొత్తంగా 15 రోజుల పాటు రాష్ట్రంలో భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ ద్విసప్తాహ కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో, దేశ స్వాతంత్ర్యం కోసం సాగిన పోరాటాలు, జరిగిన త్యాగాలు, నాటి జాతీయ నాయకులు, అమరుల వివరాలు నేటి తరానికి అర్థం కావాల్సి ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థగా మనదేశం పరిఢవిల్లుతోందని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు, రాజ్యాంగ నిర్మాతలు కలలుగన్న భారత దేశాన్ని మరింత గుణాత్మకంగా రూపొందించుకోవాల్సి ఉందన్న కేసీఆర్... నాడు వారు పొందుపరిచిన ప్రజాస్వామిక, లౌకికవాద, సమాఖ్యవాద విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారత పౌరుని మీద ఉందని వ్యాఖ్యానించారు. మారుతున్న కాలంలో పెరుగుతున్న సాంకేతికత, పని ఒత్తిడి, ఆర్థిక అవసరాల నేపథ్యంలో నాటితరం ఆచరించిన దేశభక్తి, అంతటి భావోద్వేగం నేటి యువతలో ప్రదర్శితం కావడం లేదని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఇటువంటి వాతావరణాన్ని పున:సమీక్షించుకోవాల్సి ఉందని... స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకోవాల్సిన అక్కెర దేశభక్తులైన తెలంగాణ బిడ్డలకుందన్నారు. పల్లె, పట్నం ఒక్కటై భారతావని ఘనకీర్తిని చాటాల్సి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు.

రాష్ట్రంలోని ప్రతి ఇంటిమీద జాతీయ పతాకం ఎగరాలన్న సీఎం.. అందుకు అవసరమైన కోటీ 20 లక్షల త్రివర్ణ పతాకాల తయారీకి ఏర్పాట్లు చేయాలని చెప్పారు. గద్వాల, నారాయణ్​పేట్, సిరిసిల్ల, పోచంపల్లి, భువనగిరి, వరంగల్ తదితర ప్రాంతాల్లోని చేనేత, పవర్ లూమ్ కార్మికులకు ఆర్డర్ ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం మీద జాతీయ పతాకాన్ని అత్యున్నతంగా ఎగురవేయాలని చెప్పారు. జాతీయ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని జీఏడీ అధికారులను ఆదేశించారు. ప్రతి ప్రభుత్వ వాహనం మీద జాతీయజెండా ఎగిరేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అవసరమయ్యే జాతీయ పతాకాల ముద్రణా ఖర్చు సహా దేశభక్తి ప్రచార కార్యక్రమాల కోసం ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, పట్టణాల్లోని స్టార్ హోటల్లు సహా ప్రధాన కూడళ్లు, రహదారుల వెంట అనువైన చోటల్లా దేశభక్తి స్ఫూర్తి జాలువారేలా, జాతీయ జెండా రెపరెపలాడేలా చర్యలు చేపట్టాలని సీఎస్ సోమేశ్ కుమార్​ను ఆదేశించారు. ప్రజలు, ఉద్యోగుల నడుమ సత్సంబంధాలు పెంపొందించే ఫ్రెండ్లీ ప్రభుత్వ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్న సీఎం... ఉద్యోగుల్లో కూడా దేశభక్తిని రగిలించే సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఫ్రీడం రన్​లను నిర్వహించాలన్నారు. పంచాయతీరాజ్, పురపాలకశాఖల సారథ్యంలో పల్లె నుంచి పట్నం దాకా స్వాతంత్ర్య వజ్రోత్సవ దీప్తిని వెలిగించే దిశగా తగు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణ, దేశంలోని పలు ప్రాంతాలనుంచి, స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న నాటితరం జాతీయ నాయకుల వివరాలు విద్యాసంస్థల్లో విద్యార్థులు, యువతకు అర్థమయ్యేలా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు.

రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ ద్విసప్తాహం కార్యక్రమాలు నిర్వహించాలన్న సీఎం కేసీఆర్... ఆటలు, వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం, దేశభక్తిగీతాల పోటీలు, నాటికలు, ఏకపాత్రాభినయం తదితర దేశభక్తిని ఉద్దీపన చేసే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమాల్లో పోలీసు సహా అన్ని ప్రభుత్వ శాఖలు పాల్గొనాలన్నారు. రోజువారీ షెడ్యూలు రూపొందించుకుని రెండు వారాల పాటు అమలు చేయాలని సూచించారు. విధివిధానాల రూపకల్పన కోసం ప్రత్యేక కమిటీ నియమించాలని సీఎస్​ను ఆదేశించారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహా సర్పంచ్ స్థాయి ప్రజాప్రతినిధులతో పాటు, ప్రభుత్వ కార్యదర్శులు సహా ఉన్నతాధికారులు లెటర్ ప్యాడ్లమీద జాతీయ జెండా బొమ్మను ముద్రించుకోవాలని సీఎం సూచించారు.

వేడుకల్లో మీడియా యాజమాన్యాలు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరిన ముఖ్యమంత్రి... 15 రోజుల పాటు పత్రికల మాస్టర్ హెడ్స్ మీద జాతీయ పతాక చిహ్నాన్ని ముద్రించాలని విజ్ఞప్తి చేశారు. టీవీ ఛానళ్లలో 15 రోజుల పాటు జాతీయ పతాక చిహ్నం నిత్యం కనిపించేలా ప్రసారం చేయాలని మీడియా యాజమాన్యాలను కోరారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ సప్తాహం సందర్భంగా దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు.

ఇవీ చదవండి:నటితో రెడ్​హ్యాండెడ్​గా దొరికిపోయిన హీరో.. రోడ్డుపైనే భార్య రచ్చ రంబోలా

కేటీఆర్‌ కాలికి గాయం.. మూడు వారాలు విశ్రాంతి.. అభిమానుల్లో నిరుత్సాహం..

Last Updated : Jul 23, 2022, 9:31 PM IST

ABOUT THE AUTHOR

...view details