తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే డిజిటల్ సర్వే: సీఎం కేసీఆర్‌ - telangana varthalu

cm kcr Order to call for tenders immediately for digital survey of lands
cm kcr Order to call for tenders immediately for digital survey of lands

By

Published : Feb 18, 2021, 7:39 PM IST

Updated : Feb 19, 2021, 4:28 AM IST

19:37 February 18

భూముల డిజిటల్ సర్వే కోసం వెంటనే టెండర్లు పిలవాలి: సీఎం

     రెవెన్యూ సంస్కరణలు, ధరణి పోర్టల్ పనితీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్​ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్  సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, కార్యదర్శులు స్మితా సభర్వాల్,  భూపాల్ రెడ్డి, తదితరులతో చర్చించారు. భూముల డిజిటల్ సర్వే కోసం వెంటనే టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. అసెంబ్లీలో ఇంతకుముందే ప్రకటించినట్లు త్వరలోనే డిజిటల్ సర్వే నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇప్పటికే ప్రారంభం కావాల్సిన సర్వే కరోనా వల్ల ఆగిందన్నారు. వ్యవసాయ భూములకు అక్షాంశ, రేఖాంశాలను ఇస్తామని... వాటిని ఎవరూ మార్చలేరని సీఎం అన్నారు. గందరగోళానికి, తారుమారు చేయడానికి ఆస్కారం ఉండదన్నారు.

ధరణి విజయవంతం

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి పారదర్శకంగా జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎంతో శ్రమించి, ప్రవేశ పెట్టి, అమలు చేస్తున్న ధరణి పోర్టల్ నూటికి నూరు పాళ్లు విజయవంతమయిందని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. రెవెన్యూలో సంస్కరణలు తెచ్చిన ఫలితంగా, రెవెన్యూ శాఖ పని విధానంలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయని, ఈ నేపథ్యంలో ఆ శాఖ అధికారులు భవిష్యత్తులో నిర్వహించాల్సిన విధులకు సంబంధించి జాబ్ చార్టు రూపొందించనున్నట్లు సీఎం వెల్లడించారు.

అవినీతికి తావులేదు

  ధరణి వల్ల రెవెన్యూలో అవినీతి అంతమైందని... నోరులేని, అమాయకుల రైతులకు న్యాయం జరిగిందని సీఎం కేసీఆర్​ అభిప్రాయపడ్డారు. ఒకరి భూమిని ఇంకొకరి పేరు మీద రాసే అరాచకంతో పాటు... జుట్టుకు జుట్టుకు ముడేసి పంచాయతీ పెట్టే దుష్ట సంప్రదాయం ఆగిందని ఆయన అన్నారు . డాక్యుమెంట్లు గోల్ మాల్ చేసి, రెవెన్యూ కోర్టుల పేరిట జరిగే దుర్మార్గం పోయిందని సమీక్షలో వెల్లడించారు. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లలో అవినీతికి తావులేదన్నారు.  

అక్రమ మార్పులకు ఆస్కారం లేదు

    ధరణిలో నమోదైన భూములను మాత్రమే అమ్మే, కొనే వీలుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పకడ్బందీ విధానం వల్ల ధరణిలో అక్రమ మార్పులకు తావు లేదని ఆయన పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్లు సజావుగా సాగడం కొందరికి మింగుడు పడటం లేదని... పైరవీలతో అక్రమంగా సంపాదించుకునే వారిలోనే ఆందోళన నెలకొందన్నారు.

పోడు భూముల సమస్య పరిష్కారం

  ఒకసారి సర్వే పూర్తయితే అన్ని విషయాలపై స్పష్టత వస్తుందని..  రైతుల భూముల మధ్య, అటవీ- ప్రభుత్వ భూముల మధ్య, అటవీ-ప్రైవేటు భూముల మధ్య హద్దుల పంచాయతీ కూడా పరిష్కారం అవుతుందని సీఎం వెల్లడించారు. . పోడు భూముల సమస్య కూడా పరిష్కారం అవుతుందన్నారు.  3-4 నెలల్లో మొత్తం సమస్యలు కొలిక్కి వస్తాయని ఆయన స్పష్టం చేశారు.  

రెవెన్యూ శాఖలో మార్పులు 

రెవెన్యూలో సంస్కరణలు తెచ్చిన ఫలితంగా, రెవెన్యూ శాఖ పని విధానంలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయని, ఈ నేపథ్యంలో ఆ శాఖ అధికారులు భవిష్యత్తులో నిర్వహించాల్సిన విధులకు సంబంధించి జాబ్ చార్టు రూపొందించనున్నట్లు సీఎం వెల్లడించారు. ఏమైనా సమస్యలుంటే రైతులు ఇకపై కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని సీఎం సూచించారు. సీఎస్ నుంచి వచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా కలెక్టర్లు పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.  

ఇదీ చదవండి:'రామోజీ ఫిల్మ్‌సిటీ ' పర్యాటకుల సందడి

Last Updated : Feb 19, 2021, 4:28 AM IST

ABOUT THE AUTHOR

...view details