తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR Review : ప్రాణ నష్టం జరగొద్దు.. వర్షాలు-వరదలపై అధికారులకు కేసీఆర్ ఆదేశాలు

CM KCR on Telangana Rains : రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నందున తీసుకోవాల్సిన అత్యవసర చర్యలపై... మంత్రులు, అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. వర్షాల వల్ల ప్రాణ నష్టం జరగకుండా చూడాలని మంత్రులను ఆదేశించించిన కేసీఆర్.. సహాయచర్యల కోసం క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని అందుబాటులో ఉంచాలని సీఎస్‌ శాంతికుమారికి దిశా నిర్దేశం చేశారు. సీఎం ఆదేశాలతో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

CM KCR
CM KCR

By

Published : Jul 28, 2023, 7:59 AM IST

ప్రాణ నష్టం జరగొద్దు.. సహాయక చర్యలపై మంత్రులు, అధికారులకు సీఎం దిశానిర్దేశం

CM KCR Review on Rains and Floods :రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అవాంఛనీయ ఘటనల నుంచి ప్రజలను రక్షిస్తూ, ప్రాణ నష్ట నివారణ చర్యలు చేపట్టే దిశగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగానికి... సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. మంత్రులతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతూ అనుకోకుండా ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే వెంటనే వారికి మెరుగైన చికిత్స అందించేలా చూసుకోవాలని కోరారు. ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులంతాముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా, అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ రక్షణ చర్యలు చేపట్టాలని కేసీఆర్ మంత్రులను ఆదేశించారు. ఎలాంటి ఇబ్బంది కలిగినా చర్యల కోసం సీఎస్‌ శాంతికుమారికి... సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు.

CM KCR Alert on Telangana Rains : ముంపునకు గురైన ప్రాంతాల్లో... ఎన్డీఆర్​ఎఫ్ బృందాలు, రక్షణచర్యల కోసం హెలికాప్టర్లు సహా, ఆహారం, వైద్యం తదితర రక్షణ సామాగ్రి, సంబంధిత శాఖల యంత్రాంగాన్ని పంపేలా చర్యలు చేపట్టారు. విపత్తుల నిర్వహణ, అగ్నిమాపక, పోలీస్‌శాఖతో సమన్వయం చేస్తూ సహాయక చర్యలు చేపట్టారు. పోలీస్ యంత్రాంగాన్ని సహాయక చర్యల్లో పాల్గొనేలా అప్రమత్తం చేయాల్సిందిగా రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు స్టేట్ లెవల్ ఫ్లడ్ మానిటరింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి... డీజీపీ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను తరలించేందుకు పోలీసులు చేస్తున్న కృషి ఫలిస్తోంది.

Heavy Rains in Telangana :ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి, ఉపనదులు, వాగులు, వంకలు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న తరుణంలో ముంపును తగ్గించే చర్యలు చేపట్టడం సహా ఇన్‌ఫ్లోను ముందస్తు అంచనా వేసి, గేట్లు ఎత్తివేసి కిందకు వదలాలలని చీఫ్ ఇంజనీర్లను... సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎస్సారెస్పీ, కాళేశ్వరం, కడెం, మిడ్‌మానేరు, లోయర్ మానేరు తదితర ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లకు... సీఎం కేసీఆర్ ఫోన్లు చేసి, పరిస్థితిపై ఆరా తీశారు. అధికారులను అప్రమత్తం చేస్తూనే... సహాయక చర్యల్లో పాల్గొనాలని మంత్రులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

జీహెచ్​ఎంసీలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన కేటీఆర్ :ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో జీహెచ్ఎంసీ పరిధిలో విస్తృతంగా పర్యటించిన మంత్రి కేటీఆర్.. ప్రజలను పరామర్శిస్తూ, అధికార యంత్రాంగానికి ఆదేశాలిస్తూ రక్షణ చర్యలపై దిశానిర్దేశం చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తూ, సహాయచర్యలను చేపట్టేలా అధికారులకి ఆదేశాలిచ్చారు. ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు భరోసానిచ్చారు. జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేసి, ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనెలా చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌లో పరిస్థితిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ విజయలక్షి, అధికారులతో సమీక్షించారు.

పునరావాస సహాయక చర్యలలో బీజీగా మంత్రులు : మంత్రి హరీశ్‌రావు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, రాష్ట్రస్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి, జిల్లాల్లో కాల్‌సెంటర్లను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ అత్యవసర వైద్యసేవలు అందేలా అందించేలా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి... పునరావాస సహాయక చర్యలు చేపట్టారు. సీఎం కేసీఆర్ ప్రశాంత్ రెడ్డికి ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మంత్రి సత్యవతి రాఠోడ్​కి ఫోన్‌ చేసిన కేసీఆర్.. గోదావరి పరివాహక ప్రాంతాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నీట మునిగిన మోరంపల్లిలో ప్రజల రక్షణ చర్యలపై సమీక్షించారు. చలివాగుతో పాటు ములుగు జిల్లాలో ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించిన మంత్రి సత్యవతి సహాయచర్యలపై ఆరా తీశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులతో పరిస్థితిని సమీక్షించారు.

మంత్రులకు సీఎం కేసీఆర్ ఫోన్.. ఆ ప్రాజెక్టులపై పరిస్థితిపై ఆరా :మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భద్రాచలం వద్ద గోదావరి వరద పరిస్థితిని పరిశీలించారు. స్వయంగా రంగంలోకి దిగిన మంత్రి... మున్నేరు వాగులో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కరీంనగర్ జిల్లా పరిధిలోని పరిస్థితిని క్షేత్రస్థాయిలో మంత్రి గంగుల కమలాకర్ పర్యవేక్షించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్... ధర్మపురి లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి, పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించి ప్రజలకు ఆహారం, దుస్తులు అందించారు. కడెం ప్రాజెక్టుపై పరిస్థితి గురించి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ఫోన్‌ చేసి ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్షాలపై సమీక్షించిన మంత్రి జగదీశ్‌రెడ్డి.. మూసీ తదితర ప్రాంతాల్లో రక్షణచర్యలు చేపట్టాలని ఆదేశించారు. మహబూబ్‌నగర్‌లో ముంపు ప్రాంతాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరిగి ప్రజలకు భరోసానిచ్చారు. వరదనీరు ఇళ్లలోకి రాకుండా, సాఫీగా ప్రవహించేలా చర్యలు చేపట్టేలా అధికారులను ఆదేశించారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details