CM KCR on Telangana Assembly Elections 2023 : అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం-సొంత రాష్ట్రంలో సాధించిన ప్రగతిపై ఇవాళ శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. శాసనసభ ఎన్నికల ముందు దాదాపుగా చివరి భేటీ కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించారు. అలాగే ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు, గత తొమ్మిదేళ్లలో తెలంగాణ సాధించిన పురోగతిపై సీఎం వివరణ ఇచ్చారు. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని.. ప్రస్తుతం కంటే మరో 7, 8 సీట్లు ఎక్కువగానే వస్తాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
CM KCR Comments on Telangana Irrigation Development : పల్లెలు, పట్టణాల్లో రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ప్రతి ఇంటికి 20 వేల లీటర్ల మంచినీళ్లు ఇస్తున్నామన్న సీఎం.. ప్రజల నుంచి రూపాయి తీసుకోకుండా ప్రతి ఇంటికి మంచినీరు ఇస్తున్నామన్నారు. ఇప్పుడు తండాలు, గిరిజన ఆవాసాల్లో రోగాలు కనిపిస్తున్నాయా అని కేసీఆర్ ప్రశ్నించారు. 13 రాష్ట్రాలు, కొన్ని దేశాల ప్రతినిధులు వచ్చి మన మిషన్ భగీరథను అధ్యయనం చేస్తున్నారన్నారు. గ్రావిటీతోనే వేలాది గ్రామాల్లో ఇంటింటికి తాగునీరు ఇస్తున్నామన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. పారుశుద్ధ్యం, మంచినీరు విషయంలో కేంద్రం ఎన్నో అవార్డులు ఇచ్చిందని వ్యాఖ్యానించారు.
'దేశంలో వీధి నల్లాలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ. తెలంగాణకు రూపాయి ఇవ్వని కేంద్రం అవార్డులు మాత్రం బాగానే ఇచ్చింది. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో 35 వేల చెరువులు అదృశ్యం అయ్యాయి. తెలంగాణ వస్తే ముందుగా చెరువులనే బాగు చేసుకోవాలని నిర్ణయించాం. మిషన్ కాకతీయ అనే పేరును రాష్ట్ర అవిర్భావానికి ముందే నిర్ణయించాం. కాళేశ్వరం నుంచే తుంగతుర్తి, కోదాడ, డోర్నకల్‌కు నీళ్లు వెళ్తున్నాయి. కాళేశ్వరం నిర్మించకుంటే కొత్తగా వేల ఎకరాలకు నీరు ఎక్కడ్నుంచి వస్తోంది. కరీంనగర్ జిల్లాలో 4 సజీవ జలధారలు కాళేశ్వరం వల్లే పారుతున్నాయి. కాలువల్లో ఏడాది పొడుగునా నీళ్లు పారుతున్నాయి. కృష్ణా ప్రాజెక్టులకు నీళ్లు రాకుంటే కాళేశ్వరం నుంచి తీసుకోనేలా ప్రణాళికలు చేశాం.'-ముఖ్యమంత్రి కేసీఆర్
CM KCR Speech at Assembly Sessions 2023 : 'ఏపీ కంటే తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం రూ.లక్ష ఎక్కువగా ఉంది'
కాంగ్రెస్ వస్తే కరెంట్, రైతుబంధు పోతాయని ప్రజలు భయపడుతున్నారు : దేశంలోనే అత్యుత్తమ పునరావాసాలు నిర్మించింది తెలంగాణ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తమ పునరావాస గ్రామాలు చూసి కేంద్ర బృందాలు ప్రశంసించాయన్నారు. వరద వల్ల నష్టపోయిన వారిని కాపాడుకుంటామన్న కేసీఆర్.. హైదరాబాద్‌లో తీవ్రనష్టం జరిగితే కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని ధ్వజమెత్తారు. వరదల్లో బండి పోతే బండి ఇస్తాం, గుండు పోతే గుండు ఇస్తాం అన్న వ్యక్తి జాడ లేరని ఎద్దేవా చేశారు. 7 లక్షల టన్నుల యూరియా వాడే తెలంగాణ ఇవాళ 27 లక్షల టన్నులు వాడుతోందన్నారు. మళ్లీ కాంగ్రెస్ వస్తే కరెంట్,రైతుబంధు పోతాయని ప్రజలు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తుంటే 420 కేసులు వేశారన్నారు.