CM KCR On Rajya sabha: రాష్ట్రంలో రెండు వేర్వేరు తేదీల్లో జరిగే 3 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు పార్టీ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ఒకేసారి ప్రకటించనున్నారని తెలిసింది. బండా ప్రకాశ్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి నిర్వహించే ఉప ఎన్నికకు గురువారం నోటిఫికేషన్ జారీ అయ్యింది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 19 వరకు గడువు ఉంది. పోలింగ్ 30వ తేదీన జరగనుంది. కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్‌ల పదవీ విరమణతో ఖాళీ అయ్యే రెండు స్థానాలకు ఈ నెల 24న నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ మూడు స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ ఇప్పటికే కసరత్తు చేపట్టారు. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి రూపకల్పన సన్నాహాల్లో ఉన్న ఆయన జాతీయ రాజకీయాల కోణంలో దిల్లీలో కీలకపాత్ర పోషించగల వారికే రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు తెలిసింది. తెలుగు, ఆంగ్లంతో పాటు హిందీ భాషా పరిజ్ఞానం గల మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, ఇతర ప్రముఖ నేతల పేర్లను ఆయన పరిశీలిస్తున్నారు. ఈ నెల 17 లేదా 18న ముగ్గురు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి, వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.
ఎర్రవల్లిలో కొనసాగుతున్న చర్చలు..:ప్రత్యామ్నాయ రాజకీయశక్తి రూపకల్పనపై కేసీఆర్ ఎర్రవల్లిలోని తమ నివాసంలో పలువురు ముఖ్యనేతలతో సమావేశమై చర్చిస్తున్నారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్, మంత్రులతో పాటు సినీనటుడు ప్రకాశ్‌రాజ్ సైతం ఈ భేటీల్లో పాల్గొంటున్నారు. ఈ నెల 15 వరకు సీఎం ఈ సమావేశాలను కొనసాగించే వీలున్నట్లు తెలిసింది.
ఏపీ నుంచి రాజ్యసభ రేసులో ఎవరు?:వైకాపా పార్లమెంటరీ పార్టీ నేతగా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని వైకాపా మరోమారు పొడిగించనుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఎమ్మెల్యేల సంఖ్యాబలం పరంగా చూస్తే ఈ నాలుగు సీట్లూ వైకాపాకే దక్కనున్నాయి. ఈ నలుగురిలో విజయసాయిరెడ్డి పదవి జూన్‌లో ముగియనున్నప్పటికీ ఆయన్ను మరోసారి రాజ్యసభకు పంపేందుకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో మిగిలిన 3 సీట్లు ఎవరెవరికి ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది.