సీఎం కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలివే..
- కేంద్రం ధాన్యం సేకరించే వరకు విశ్రమించే ప్రసక్తే లేదు
- ఆహార ధాన్య సేకరణలో 'ఒకే దేశం-ఒకే సేకరణ' విధానం ఉండాలి
- ఆరునూరైనా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదు..
- ప్రశాంత్ కిషోర్‌తో కలిసి పనిచేస్తే తప్పేంటి?
- 80 వేల ఉద్యోగాలు నింపుతున్నాం. కచ్చితంగా నింపి తీరుతాం..
- ఈ కశ్మీర్ ఫైల్స్ ఏంటో.. దిక్కుమాలిన వ్యవహారం
- తెలంగాణ ప్రజలతో పెట్టుకోవద్దని ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నా..
- భాజపా గ్రాఫ్ రోజురోజుకు పడిపోతోంది..
CM KCR:కేంద్రం ధాన్యం సేకరణపై అంగీకరించకపోతే తెలంగాణ ఉద్యమ పంథాలో పోరాడుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రేపు మంత్రులు, ఎంపీల బృందం కేంద్రమంత్రిని కలుస్తారని... అక్కడ సానుకూల స్పందన రాకుంటే... పెద్దఎత్తున ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేపడతామని ప్రకటించారు. కేంద్రం ధాన్యం సేకరించే వరకు విశ్రమించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఆషామాషీగా కాకుండా కార్యాచరణ మేరకు పోరాటం ఉంటుందన్నారు. పంచాయతీల తీర్మానాలను కూడా కేంద్రానికి పంపుతామన్నారు. మండల, జిల్లా పరిషత్‌ల తీర్మానాలు కేంద్రానికి పంపుతామన్న సీఎం.. మున్సిపాలిటీలు, మార్కెట్ కమిటీల తీర్మానాలు కూడా పంపుతామన్నారు.
నోటిఫికేషన్లకు టైం పడుతది..
ఉద్యోగ నోటిఫికేషన్లపై అడిగిన ప్రశ్నకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. 'టైం పడుతదయ్యా బాబు. ఎటుపడితే అటు ఇస్తే కోర్టు కేసు పెడుతరా?. 80 వేల ఉద్యోగాలు నింపుతున్నాం. కచ్చితంగా నింపి తీరుతాం. దీనిపై ఎలాంటి ఆందోళన వద్దు' అంటూ ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. ఏటా ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేసి పోస్టులు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పాఠశాలలు మూస్తారని అపోహలు సృష్టిస్తున్నారన్న సీఎం.. రాష్ట్రంలో పాఠశాలలు మూసివేయట్లేదని వెల్లడించారు. పాఠశాలలో అవసరం మేరకు సిబ్బంది ఉండాలన్న సీఎం.. అన్ని సబ్జెక్టుల బోధనకు మరో 10 వేల సిబ్బందినైనా నియమిస్తామన్నారు.
పంజాబ్ తరహాలో ధాన్యం సేకరించాలి..
రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రం సేకరించాలని టీఆర్ఎస్ఎల్పీ భేటీలో తీర్మానం చేసినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. పంజాబ్ తరహాలో కేంద్రం ధాన్యాన్ని సేకరించాలని తీర్మానం చేశామని సీఎం పేర్కొన్నారు. రేపు మంత్రులు, ఎంపీల బృందం దిల్లీ వెళ్లి కేంద్రమంత్రిని కలుస్తారని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాష్ట్రంలో పండిన పంటను కేంద్రం సేకరించాలన్నారు. ఎక్కువ పంట వస్తే ప్రాసెస్ చేసి నష్టం వస్తే కేంద్రమే భరించాలని ముఖ్యమంత్రి తెలిపారు.
'ఒకే దేశం-ఒకే సేకరణ' విధానం ఉండాలి..
దేశవ్యాప్తంగా ఒకే విధానమైన ధాన్యం సేకరణ విధానం ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. 'వన్ నేషన్-వన్ రేషన్' అని చెబుతున్న కేంద్రం... ధాన్యం సేకరణలో 'వన్ నేషన్-వన్ ప్రొక్యూర్‌మెంట్ ' పద్ధతిని అవలంభించాలని స్పష్టం చేశారు. ఈసారి యాసంగిలో 35 లక్షల ఎకరాల్లో ధాన్యం వస్తుందన్న కేసీఆర్.... పంట మార్పిడి కింద దాదాపు 25 లక్షల ఎకరాలు తగ్గిందని తెలిపారు. పంజాబ్‌లో ఎలా సేకరిస్తున్నారో అదే నీతిని తెలంగాణలోనూ అమలుచేయాలని డిమాండ్ చేశారు.
కేంద్రం కొనుగోలు చేయాలి..
ఆహార ధాన్య సేకరణలో దేశమంతా ఒకే విధానం ఉండాలి. ఆహార ధాన్య సేకరణలో 'ఒకే దేశం-ఒకే సేకరణ' విధానం ఉండాలి. ధాన్యం సేకరణలో గతంలోనూ కేంద్రం ఇబ్బందులు సృష్టించింది. యాసంగిలో వచ్చే వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలి. కనీస మద్దతు ధర బియ్యానికి కాదు.. ధాన్యానికి నిర్ణయిస్తారు. కనీస మద్దతు ధర ప్రకారమే పంజాబ్‌లో ధాన్యం సేకరిస్తున్నారు. కనీస మద్దతు ధర ప్రకారమే తెలంగాణ ధాన్యం తీసుకోవాలి. బాయిల్డ్ రైస్ మాత్రమే ఇవ్వాలని కేంద్రం చెబుతోంది. ధాన్యం ఇస్తే రా రైస్ చేస్తారా? బాయిల్డ్ రైస్ చేస్తారా? అనేది కేంద్రం నిర్ణయం. -సీఎం కేసీఆర్
కశ్మీర్ ఫైల్స్‌పై సీఎం సీరియస్..
కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ ఫైల్స్ నినాదాన్ని లేవనెత్తిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్ పండిట్‌లు తమకు అన్యాయం జరిగిందని వాపోతున్నారని సీఎం వెల్లడించారు. కశ్మీర్ పండిట్‌లకు జరిగిన అన్యాయాన్ని ఓట్ల రూపంలో కొల్లగొట్టేందుకే కేంద్రం యత్నిస్తోందని ఆరోపించారు. దేశ ప్రజల విభజన చేసి విద్వేషాలను రెచ్చగొట్టే యత్నం జరుగుతోందని ఆయన ఆరోపణలు చేశారు. భాజపా పాలిత ప్రాంతాల్లో సెలవులు ఇచ్చి కశ్మీర్ ఫైల్స్ చూడాలని ఉద్యోగులకు చెబుతున్నారని మండిపడ్డారు..