CM KCR on BRS Party: "అబ్ కీ బార్ కిసాన్ సర్కార్" అని సీఎం కేసీఆర్ నినదించారు. దేశపరివర్తన కోసమే బీఆర్ఎస్ ఏర్పడుతుందని ఆయన వెల్లడించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భారత్ రాష్ట్ర సమితి జెండాను ఆవిష్కరించిన కేసీఆర్... దిల్లీ ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండానేనన్నారు.
దిల్లీలో ఈనెల 14న భారత్ రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ప్రారంభిస్తామని కేసీఆర్ తెలిపారు. తన ప్రతి ప్రస్థానంలో అవహేళనలు సర్వసాధారణమన్న ఆయన... తెలంగాణ కోసం తెరాస ఏర్పాటు సమయంలోనూ ఎన్నో విమర్శలు చేశారని పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు.. రాజకీయ పార్టీలు కాదని వ్యాఖ్యానించారు.
'దేశ పరివర్తన కోసమే.. 'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' నినాదంతో బీఆర్ఎస్' 'దేశానికి ఇప్పుడు కొత్త ఆర్థిక విధానం అవసరం. కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రి కావాలి. జాతీయస్థాయిలో కొత్త పర్యావరణ విధానం. మహిళా సాధికారత కోసం కొత్త జాతీయ విధానం. ఇకపై రాష్ట్రాల మధ్య జల యుద్ధాలు ఉండవు. నా ప్రతి ప్రస్థానంలో అవహేళనలు సర్వ సాధారణం. అవహేళనలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతికూల పరిస్థితులు అధిగమించి తెలంగాణ సాధించాం. కర్ణాటక-తెలంగాణ సరిహద్దుల్లో తెలుగువాళ్లు ఉన్నారు. తెలుగువాళ్ల కోసంభారాస కృషి చేస్తోంది.' -సీఎం కేసీఆర్
దేశ రాజకీయ యవనికపై కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ సారథ్యంలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్పు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారాస ఆవిర్భావానికి సంబంధించి ఈసీ పంపిన లేఖపై కేసీఆర్ సంతకం చేశారు.
తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్లో తొలుత కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఆ తర్వాత ఈసీ పంపిన లేఖకు అంగీకారం తెలుపుతూ సుముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 1.20 గంటలకు కేసీఆర్ సంతకం చేశారు. దీంతో భారత్ రాష్ట్ర సమితి అమల్లోకి వచ్చినట్లయింది. కేసీఆర్ సంతకం చేసిన లేఖను అధికారికంగా ఈసీకి పంపనున్నారు.
బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా కేసీఆర్‌కు జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, ప్రముఖ సినీనటుడు ప్రకాశ్‌రాజ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆవిర్భావ వేడుకల్లో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ భవన్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. బాణసంచా కాలుస్తూ ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు సంబరాలు చేసుకున్నారు.
ఇవీ చదవండి: