తెలంగాణ

telangana

ETV Bharat / state

' విద్యాసంస్థల బంద్.. వీలైతే శుభకార్యాలు వాయిదా వేసుకోండి' - schools, theaters closed in telangana

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని మంత్రిమండలి నిర్ణయించింది. కొవిడ్- 19 వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. ఈనెల 31 వరకు అన్ని విద్యాసంస్థలను మూసి వేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. శుభకార్యాలను కూడా వీలైతే వాయిదా వేసుకోవాలని సూచించారు.

Cm kcr on corona virus
'వీలైతే శుభకార్యాలు కూడా వాయిదా వేసుకోండి

By

Published : Mar 15, 2020, 5:50 AM IST

Updated : Mar 15, 2020, 8:19 AM IST

'వీలైతే శుభకార్యాలు కూడా వాయిదా వేసుకోండి

కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఈనెల 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కోచింగ్‌ సెంటర్లు, వేసవి శిబిరాలు కూడా నడపొద్దని నిర్ణయించారు. ఇప్పటికే షెడ్యూల్‌ ప్రకటించిన పరీక్షలు మాత్రం యథావిధిగా ఉంటాయని వివరించారు. ప్రభుత్వ రెసిడెన్షియల్‌ విద్యార్థులకు హాస్టల్ వసతి కొనసాగుతుందని... వారి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని సీఎం వెల్లడించారు.

కొన్ని రోజులు మూసేయండి..

కొన్ని రోజులు ఫంక్షన్‌ హాళ్లు మూసివేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే నిర్ణయమైన వివాహాలు జరుపుకోవచ్చని... పరిమిత సంఖ్యలో బంధువుల మధ్య పెళ్లిళ్లు జరుపుకోవాలని సూచించారు. ఫంక్షన్‌ హాళ్ల యజమానులు మార్చి 31 తర్వాత వివాహాలకు బుకింగ్‌లు తీసుకోవద్దని తెలిపారు. వారంపాటు థియేటర్లు, బార్లు, మెంబర్‌షిప్‌ క్లబ్బులు మూసివేయాలని... బహిరంగసభలు, ర్యాలీలు, జాతరలు, మేళాలకు కూడా వారం రోజుల వరకు అనుమతులు ఇవ్వొద్దని ముఖ్యమంత్రి తెలిపారు. వారంపాటు ఇండోర్‌ స్టేడియాలు, జూపార్క్‌లు, మ్యూజియంలు, వ్యాయామశాలలు, ఈతకొలనులు మూసివేయాలన్నారు. ఎలాంటి క్రీడలు, టోర్నమెంట్‌లు నిర్వహించవద్దొని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి హెచ్చరించారు.

భయపడేంత ఉత్పాతం కాదు..

దేశంలో కరోనా కారణంగా ఇప్పటివరకు ఇద్దరు మాత్రమే చనిపోయారని... అందరూ భయపడేంత పెద్ద ఉత్పాతం కాదని... కేసీఆర్‌ అన్నారు. నివారణ చర్యలు, ముందస్తు జాగ్రత్తలతోనే కొవిడ్​ను ఎదుర్కోవచ్చన్నారు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటొందని కేసీఆర్ తెలిపారు. విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన బెంగళూరు వాసికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని... బాధితుడికి చికిత్స ఇచ్చి నయమైన తర్వాత డిశ్చార్జ్‌ చేశామన్నారు.

ప్రస్తుతం రెండు కేసులు..

ఇప్పుడు చికిత్స పొందుతున్న వారిలో కరోనా అనుమానిత లక్షణాలు మాత్రమే ఉన్నాయని.... రాష్ట్రంలో ప్రస్తుతం 2 కొవిడ్ కేసులు మాత్రమే ఉన్నాయని కేసీఆర్ తెలిపారు. 135 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇప్పటివరకు 83 మందికి కరోనా సోకిందని... వైరస్ బారిన పడిన వారిలో 66 మంది భారతీయులు, 16 మంది విదేశీయులున్నారని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో అవకాశం లేదు..

విదేశాల నుంచి వచ్చిన వారికి విమానాశ్రయంలోనే స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నామన్నారు. ఏడు దేశాల నుంచి రాకపోకలను కేంద్రం నిషేధించిందని... ఇతర దేశాల నుంచి వచ్చేవారికి సంపూర్ణ పరీక్షలు చేసిన తర్వాతే స్వస్థలాలకు పంపిస్తున్నామని తెలిపారు. విదేశాల నుంచి వస్తున్న వారి నుంచే కరోనా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని.. గ్రామీణ ప్రాంతాలకు ఈ వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలు చాలా తక్కువని సీఎం పేర్కొన్నారు.

రూ. 500 కోట్లతో ప్రత్యేక నిధి..

కొవిడ్-19 బాధితుల కోసం వివిధ ఆస్పత్రుల్లో 1,020 పడకలు, 321 ఐసీయూ బెడ్స్‌, 240 వెంటిలేటర్స్‌ సిద్ధంగా ఉన్నాయని సీఎం తెలిపారు. రాష్ట్రంలో 4 క్వారంటైన్‌ ఫెసిలిటీస్‌ కేంద్రాలతోపాటు రూ. 500 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేశామని కేసీఆర్ తెలిపారు. కరోనా వ్యాప్తి నిరోధానికి అన్ని శాఖల అధికారులతో కలిసి టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశామన్నారు.

సూపర్ మార్కెట్లు, మాల్స్ తెరిచే ఉంటాయి..

ప్రజల సౌకర్యార్థం సూపర్‌ మార్కెట్లు, మాల్స్ మూసివేయటం లేదని సీఎం తెలిపారు. నిత్యావసరాల విషయంలో ప్రజలకు ఇబ్బందులు రావొద్దని మాల్స్‌కు అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు యథాతథంగా నడుస్తాయని... బస్సులు, రైళ్లలో నిరంతరం పరిశుభ్రత చర్యలు తీసుకుంటామన్నారు. వ్యాధి ప్రబలినప్పుడు మాస్క్‌లు వాడితే ప్రయోజనం ఉంటుందని.... వైరస్ వ్యాప్తి చెందనప్పుడు మాస్క్‌లు పంపిణీ చేసినా.. ప్రయోజనం ఉండదన్నారు. మాస్క్‌లను అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని... జనసమూహం లేకుండా చూసుకోవడమే అన్నింటికంటే ఉత్తమన్నారు.

దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు..

సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లాలు, గ్రామాల పేర్లు రాసి ప్రజలను భయపెట్టొద్దన్నారు. ఆదేశాలు ఉల్లంఘించిన వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. మార్చి 31 తర్వాత పరిస్థితిపై సమీక్షించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.

ఇవీచూడండి:మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలు బంద్​: కేసీఆర్‌

Last Updated : Mar 15, 2020, 8:19 AM IST

ABOUT THE AUTHOR

...view details