తెలంగాణ

telangana

ETV Bharat / state

కేంద్రాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే: కేసీఆర్

కేంద్ర బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రతిపాదనల్లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై సీనియర్ అధికారులతో సమీక్షించారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల్లో కేంద్రం భారీగా కోత విధించిందని సీఎం ఆక్షేపించారు. నిధుల కోత వల్ల రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఏర్పడుతుందని చెప్పారు. కేంద్రం మాట నమ్మితే శంకరగిరి మాన్యాలే దిక్కయ్యే పరిస్థితి ఏర్పడిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

cm-kcr-on-central-budget-2020
కేంద్రాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే: కేసీఆర్

By

Published : Feb 1, 2020, 10:29 PM IST

Updated : Feb 1, 2020, 11:20 PM IST

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రతిపాదనలు పూర్తి నిరాశాజనకంగా ఉన్నాయని సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. ప్రగతి కాముక రాష్ట్రమైన తెలంగాణ పురోగతిపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై సీనియర్ అధికారులతో దాదాపు నాలుగు గంటల పాటు సమీక్షించారు.

కేంద్రం అసమర్థత వల్లే...

రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో భారీ కోత విధించడం ద్వారా తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందని సీఎం కేసీఆర్​ ఆరోపించారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా నిష్పత్తిని తగ్గించడం దారుణమని మండిపడ్డారు. నిధుల్లో భారీ కోత వల్ల రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఎదురయ్యే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. రాష్ట్రాలకు రాజ్యాంగపరమైన హక్కైన కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాలో తెలంగాణకు 2019-20లో 3731 కోట్ల రూపాయలు తగ్గాయన్న కేసీఆర్... కేంద్రం కోతతో రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక తారుమారైందని చెప్పారు. రాష్ట్రాలకు వాటా తగ్గించడం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ అసమర్థత మాత్రమేనని విమర్శించారు.

పథకాలపై ప్రభావం పడే అవకాశం...

2019-20 సంవత్సరంలో పన్నుల్లో వాటా ఏకంగా 18.9 శాతం తగ్గడం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో లోపానికి నిదర్శనంగా సీఎం కేసీఆర్​ అభివర్ణించారు. ఈ ప్రభావం తెలంగాణపై దారుణంగా పడిందని అన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనల్లో రాష్ట్రానికి వచ్చే నిధుల్లో రెండు రకాల నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్రానికి వచ్చే పన్నుల్లో రాష్ట్రాలకు చెల్లించే వాటాను 42 నుంచి 41 శాతానికి తగ్గిస్తూ 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసులను కేంద్రం ఆమోదించటం వల్ల నిధులు తగ్గాయని చెప్పారు. రాష్ట్రానికి గతంలో 2.437 శాతం వాటాను ఇవ్వగా, ఈ ఆర్థిక సంవత్సరంలో దాన్ని 2.133 శాతానికి తగ్గించారు. కేంద్ర పన్నుల్లో వాటాగా రావాల్సిన నిధుల్లో 2,381 కోట్ల రూపాయలు తగ్గనున్నట్లు వివరించారు. ఈ ప్రభావం తెలంగాణ ప్రగతి ప్రణాళికలపై పడుతుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.

జీఎస్టీ విషయంలోనూ అదే దగా...

వస్తుసేవల పన్ను జీఎస్టీ విషయంలోనూ కేంద్రం పెద్ద మోసం, దగా చేస్తోందని సీఎం విరుచుకుపడ్డారు. 14 శాతం లోపు ఆదాయ వృద్ధి రేటు కలిగిన రాష్ట్రాలకు ఏర్పడే లోటును ఐదేళ్ల పాటు భర్తీ చేస్తామని 2017 జీఎస్టీ చట్టంలో చెప్పిన కేంద్ర ప్రభుత్వం... రాష్ట్రానికి ఇవ్వాల్సిన రూ.1,137 కోట్ల విషయంలో స్పష్టత ఇవ్వలేదని ఆక్షేపించారు. పట్టణాల అభివృద్ధికి నిధుల కేటాయింపులో భారీ కోతతో... శరవేగంగా పట్టణీకరణ జరుగుతున్న తెలంగాణకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణాల అభివృద్ధి కోసం రాష్ట్రానికి 2019-20 బడ్జెట్​లో రూ.1,037 కోట్లు కేటాయించగా ఇప్పుడు 14.3శాతం కోతతో రూ.148 కోట్లు తగ్గించి కేవలం 889 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారని తెలిపారు.

కోటి ఎకరాల మాగాణి లక్ష్యం చేరెదెన్నడు?

మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చేసిన సిఫారసులను పట్టించుకోపోగా... ఈ బడ్జెట్​లోనూ ఆ ఊసే లేదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. కోటి ఎకరాల మాగాణి లక్ష్యంగా భారీ వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టుల నిర్వహణకు సహకారం కావాలని అభ్యర్థించినా కేంద్రం నిధులు కేటాయించలేదని ఆరోపించారు. తెలంగాణ అమలు చేస్తున్న అనేక ప్రజోపయోగ కార్యక్రమాలకు ఆర్థిక చేయూత ఇవ్వాలని కోరినా బడ్జెట్​లో కేటాయింపులు చేయలేదని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రాలకు న్యాయంగా రావాల్సిన నిధుల్లో కేంద్రం భారీగా కోతలు విధించడం రాష్ట్రాల పురోగతికి శరాఘాతంగా మారనుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రధాన రంగాలకు నిధులేవి?

దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనాన్ని అధిగమించేందుకు ఎలాంటి ప్రగతిశీల నిర్ణయాలు ప్రకటించలేదని... దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే నిర్ణయాలేవీ కేంద్రం తీసుకోలేదని కేసీఆర్ పేర్కొన్నారు. అతి ముఖ్యమైన రంగాలకు బడ్జెట్లో కేటాయింపులు తగ్గించడాన్ని పూర్తి ప్రగతి నిరోధక చర్యగా అభివర్ణించారు. వ్యవసాయ రంగానికి 2019-20లో 3.65 శాతం మేర నిధులు కేటాయించగా ఇప్పుడు కేవలం 3.39 శాతం మాత్రమే నిధులు కేటాయించారని సీఎం తెలిపారు. వైద్య, ఆరోగ్య రంగానికి నిధులను 2.24 శాతం నుంచి 2.13 శాతానికి తగ్గించారని అన్నారు. గ్రామీణాభివృద్ధికి గత ఏడాది 4.37 శాతం నిధులు కేటాయించగా, ఇప్పుడు కేవలం 3.94 శాతం మాత్రమే కేటాయించారని మండిపడ్డారు. విద్యా రంగానికి కేటాయింపులను 3.37 శాతం నుంచి 3.22 శాతానికి తగ్గించారని తెలిపారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి తదితర రంగాలకు నిధులను తగ్గించడం దేశ పురోభివృద్ధి, సామాజికాభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్రాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే: కేసీఆర్


ఇవీచూడండి:బడ్జెట్​ 2020​ : నిర్మలమ్మ బడ్జెట్​ విశేషాలివే

Last Updated : Feb 1, 2020, 11:20 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details