CM KCR Nominations Today :హోరాహోరీగా సాగుతున్న.. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం తుదిదశకు చేరుకుంది. శుక్రవారంతో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుండటంతో.. బుధవారం ఒక్కరోజే 622 మంది నామినేషన్లు వేయగా.. మొత్తం నామపత్రాల సంఖ్య 1314కి చేరింది. ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్లు వేయనున్నారు. ఉదయం 11 గంటలకు గజ్వేల్‌లో.. మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో నామినేషన్ వేయనున్న కేసీఆర్.. అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్, సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు సహా పలువురు మంత్రులు నామపత్రాలు సమర్పించనున్నారు. ఖమ్మంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, హుజుర్‌నగర్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నామినేషన్లు వేయనున్నారు.
MLA Candidates Nominations in Telangana 2023 :సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉపసభాపతి పద్మారావు నామినేషన్ దాఖలు చేశారు. మేడ్చల్ నుంచి నామపత్రాలు సమర్పించిన మంత్రి మల్లారెడ్డి.. ఆస్తుల వివరాలను వెల్లడించారు. వికారాబాద్‌లో ఆనంద్, పరిగిలో కొప్పుల మహేశ్‌రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. షాద్‌నగర్ నుంచి బీజేపీ అభ్యర్థి అందెబాబయ్య, ఇబ్రహీంపట్నం నుంచి బీజేపీ అభ్యర్థి దయానంద్.. నామపత్రాలు సమర్పించారు. మహేశ్వరం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, పరిగి నుంచి రామ్మోహన్ రెడ్డి అధికారులు పత్రాలు సమర్పించారు.
Nominations for Telangana Assembly Elections 2023 :ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 14 నియోజవకర్గాల్లో బుధవారం ఒక్కరోజే 58 మంది నామపత్రాలు దాఖలు చేశారు. మంచి ముహుర్తం ఉండడంతో ఇవాళ పెద్ద ఎత్తున.. నామపత్రాలు దాఖలు కానున్నాయి. మంత్రులు నిరంజన్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సహా ఇతర అభ్యర్థులు.. నామినేషన్లు వేయనున్నారు. బుధవారం మహబూబ్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి మిథున్ రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వనపర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి మేఘారెడ్డి, గద్వాలలో కాంగ్రెస్ అభ్యర్థి సరిత, అలంపూంలో కాంగ్రెస్ అభ్యర్థి సంపత్‌కుమార్ నామపత్రాలు అందించారు. నాగర్‌కర్నూల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్ధన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి రాజేశ్‌రెడ్డి.. రిటర్నింగ్ అధికారులకు పత్రాలు సమర్పించారు.
ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల పాటలు
Political Leaders Filed Nominations for Telangana Elections : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరికాంగ్రెస్ అభ్యర్థిగా కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, బీజేపీ నుంచి గూడూరు నారాయణరెడ్డి నామినేషన్లు వేశారు. ఆలేరు నుంచి 8 మందికి పైగా నామపత్రాలు అధికారులకు అందించారు. ఖమ్మం జిల్లా పాలేరు బీఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నుంచి ఓయూ పీజీ లాకళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ గుమ్మడి అనురాధ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్లు వేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా.. గాలి అనిల్ కుమార్ పోటాపోటీ ర్యాలీ నడుమ నామినేషన్లు వేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్వో కార్యాలయంలో ఎమ్మెల్యే సతీశ్ కుమార్ నామినేషన్ పత్రాలు అందించారు.