CM KCR National Tour: దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీల నేతలతో చర్చలు జరిపిన కేసీఆర్.. మరోసారి జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టారు. జాతీయ స్థాయిలో పలు రాజకీయ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు. అందులో భాగంగా ఇవాళ మధ్యాహ్నం దిల్లీ బయలుదేరి వెళ్లనున్న గులాబీదళపతి.. వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. ప్రముఖ ఆర్థికవేత్తలతో భేటీ కానున్న ఆయన.. దేశ ఆర్ధిక పరిస్థితులపై చర్చించనున్నారు. అదేవిధంగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థల జర్నలిస్టు ప్రముఖులతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈనెల 22 మధ్యాహ్నం దిల్లీ నుంచి చండీగఢ్ బయలుదేరి వెళ్లనున్న కేసీఆర్... గతంలో ప్రకటించినట్లుగా జాతీయ రైతుఉద్యమంలో అసువులు బాసిన పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, దిల్లీకి చెందిన సుమారు 600 రైతు కుటుంబాలను పరామర్శించనున్నారు. వారికి ఆర్థికంగా భరోసా అందించేందుకు ఒక్కో కుటుంబానికి 3 లక్షల చొప్పున ఆర్ధిసాయం అందించనున్నారు. ఆ చెక్కుల పంపిణీలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్సింగ్లు పాల్గొంటారు.
ఈనెల 26న బెంగళూరు వెళ్లనున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో సమావేశం కానున్నారు. మరుసటిరోజు రాలేగావ్ సిద్ధి వెళ్లనున్న గులాబీదళపతి.. ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేతో భేటీకానున్నారు. అనంతరం షిర్డీ వెళ్లి సాయిబాబా దర్శనం చేసుకోనున్నారు. అక్కడ నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఈ నెల 29 లేదా 30న బంగాల్, బిహార్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. గల్వాన్ లోయలో వీరమరణం పొందిన భారత సైనిక కుటుంబాలను సీఎం పరామర్శిస్తారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా వారి కుటుంబాలను కేసీఆర్ ఆదుకోనున్నారు.