తెలంగాణ

telangana

ETV Bharat / state

Cm Kcr Mumbai Tour: నేడు ముంబయికి సీఎం కేసీఆర్​.. ఉద్ధవ్​ ఠాక్రేతో కీలక భేటీ - cm kcr meets uddav thakre

Cm Kcr Mumbai Tour: దేశ రాజకీయాల్లో సమూల మార్పే ధ్యేయంగా కేంద్రంలోని భాజపా సర్కార్​పై గళం విప్పుతున్న సీఎం కేసీఆర్​.. ఇవాళ కీలక భేటీలు జరపనున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ఠాక్రే, ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​తో సమావేశం కోసం కేసీఆర్ నేడు ముంబయి వెళ్లనున్నారు. దేశ రాజకీయాలు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు నేతలతో సమాలోచనలు చేయనున్నారు.

Cm Kcr Mumbai Tour: నేడు ముంబైకి సీఎం కేసీఆర్​.. ఉద్ధవ్​ ఠాక్రేతో భేటీ
Cm Kcr Mumbai Tour: నేడు ముంబైకి సీఎం కేసీఆర్​.. ఉద్ధవ్​ ఠాక్రేతో భేటీ

By

Published : Feb 20, 2022, 3:12 AM IST

Updated : Feb 20, 2022, 6:56 AM IST

Cm Kcr Mumbai Tour: నేడు ముంబయికి సీఎం కేసీఆర్​.. ఉద్ధవ్​ ఠాక్రేతో కీలక భేటీ

Cm Kcr Mumbai Tour: కేంద్రంలో భాజపా వ్యతిరేక కూటమి ఏర్పాటుకు మద్దతు కూడగట్టే వ్యూహంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు ముంబయి పర్యటనకు వెళ్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేతో ఆయన నివాసంలో భేటీ అవుతారు. ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌నూ కలుస్తారు. సీఎం ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో ముంబయికి బయల్దేరి వెళ్తారు. ఆయన వెంట ఆర్థిక, వైద్యఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు తదితరులు ఉంటారు.

ఇద్దరు సీఎంలు బుధవారం ఫోన్‌లో ఇప్పటికే ప్రాథమికంగా చర్చించుకున్నారు. కేంద్రంలో భాజపా ఆధ్వర్యంలోని ప్రభుత్వ పాలన, విధానాలు, రాష్ట్రాలపట్ల అనుసరిస్తున్న వైఖరిని ఎండగడుతూ సరైన సమయంలో గళం విప్పారని ఠాక్రే.. కేసీఆర్‌కు మద్దతు ప్రకటించారు. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడటానికి మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలని కోరారు. దీనిపై చర్చించేందుకు ముంబయి రావాలని ఆహ్వానించారు. కేసీఆర్‌ ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ముంబయిలోని ఠాక్రే నివాసం వర్షలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలుస్తారు. అక్కడే ఉభయులూ భోజనం చేస్తారు.

వార్ధా బ్యారేజీ నిర్మాణంపైనా చర్చ!

మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే భాజపా విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేసీఆర్‌ సైతం భాజపాపై ధ్వజమెత్తుతున్నారు. విభజన హామీలు నెరవేర్చకపోవడం, ధాన్యం కొనుగోళ్లపై సహాయనిరాకరణ తదితర సందర్భాల్లో కేంద్రం వైఖరిని తెరాస నిరసించింది. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించింది. ప్రధానమంత్రి తెలంగాణ పర్యటనకు రాగా సీఎం దూరంగా ఉన్నారు. ఈ పరిణామాలన్నింటిపై కేసీఆర్‌, ఠాక్రేలు మాట్లాడుకొని... భాజపాపై ఎదురుదాడికి ప్రణాళిక రూపొందించే వీలుంది.
దీంతో పాటు గోదావరి నదిపై వార్ధా బ్యారేజీ నిర్మాణంపైనా చర్చిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి గతంలో రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. దాని స్థానంలో తక్కువ ముంపుతో కూడిన వార్ధా వద్ద బ్యారేజీ నిర్మించాలని తెలంగాణ ప్రతిపాదించింది. నిర్మాణాలు చేపడతామని కేసీఆర్‌ తెలియజేయనున్నారు.

* సాయంత్రం నాలుగు గంటలకు కేసీఆర్‌.. శరద్‌పవార్‌ను ఆయన నివాసంలో కలుస్తారు. పవార్‌తో కేసీఆర్‌కు మంచి అనుబంధం ఉంది. తెలంగాణకు ఆ పార్టీ మద్దతునిచ్చింది. తాజా రాజకీయ పరిణామాల్లో భాజపా విధానాలపై ధ్వజమెత్తుతున్న సీఎం... పవార్‌ను కలిసి తమ ప్రయత్నాలకు మద్దతు కోరనున్నారు. దేశ రాజకీయ పరిణామాలు, భాజపా పాలన, ప్రజావ్యతిరేక విధానాలు, దేశానికి జరుగుతున్న నష్టం గురించి తెలియజేయనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా ముంబయి నగరంలో పలు చోట్ల కేసీఆర్‌ ఫ్లెక్సీలు, కటౌట్లను తెరాస అభిమానులు ఏర్పాటు చేశారు.

మళ్లీ రాష్ట్రాల పర్యటనలు

భాజపాయేతర, కాంగ్రెసేతర సీఎంలు, పార్టీల మద్దతును కూడగట్టే విషయమై సీఎం కేసీఆర్‌ గతంలో బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో చర్చించారు. కేరళ సీఎం పినరయి విజయన్‌ హైదరాబాద్‌కు రాగా ఆయనతోనూ కేసీఆర్‌ సమావేశమయ్యారు. తాజాగా ఠాక్రేతో సమావేశం అనంతరం ఆయన బెంగాల్‌, తమిళనాడు, కేరళ, ఒడిశా రాష్ట్రాలలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రులతో చర్చించిన అనంతరం దిల్లీ వెళ్లి అక్కడ విపక్ష పార్టీలకు చెందిన ముఖ్యనేతలతో భేటీ అయ్యే వీలుంది. తెలంగాణ బడ్జెట్‌ సమావేశాల అనంతరం ఈ భేటీ జరుగుతుంది.

* 21న నారాయణఖేడ్‌లో సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి సీఎం శంకుస్థాపన చేస్తారు. 23న.. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ను ప్రారంభించనున్నారు.

ఇదీ చూడండి: భారత్‌పై మళ్లీ దావూద్‌ గురి.. దేశవ్యాప్తంగా దాడులకు కుట్ర..

Last Updated : Feb 20, 2022, 6:56 AM IST

ABOUT THE AUTHOR

...view details