కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణకు నయా పైసా సాయం చేయలేదని ధ్వజమెత్తారు. ఆ పార్టీ అబద్దాలు చెబుతోందని.. విపక్ష పార్టీల ప్రభుత్వాలను కూలగొట్టడం మినహా ఏమి చేయడం లేదని విమర్శించారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని కేంద్ర ప్రభుత్వ వివక్షను ఎదుర్కొనడానికి వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. వ్యవసాయ, విద్యుత్ బిల్లులు ప్రజా వ్యతిరేకంగా ఉన్నందునే వాటిని వ్యతిరేకరించామని చెప్పారు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ సమర్థంగా లేదని కేసీఆర్ పేర్కొన్నారు. నదీ జలాల కేటాయింపు, వినియోగం విషయంలో ఏపీ ప్రభుత్వం అతిగా వ్యవహరిస్తోందని.. కేంద్రం కూడా సరిగా లేదని సీఎం అన్నారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలు జరగనున్న హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ప్రగతిభవన్లో కేసీఆర్ సమావేశం నిర్వహించారు.
ఎన్నిక ఏదైనా
రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా గెలుపు తెరాసదే కావాలన్నారు. అందరం కలిసి తెరాస కుటుంబంగా విజయాన్ని సాధించాలన్నారు. రానున్న శాసనమండలి, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలపై అన్ని సర్వేలు తమకే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. యువకులు, నిరుద్యోగులు తెరాసకు వ్యతిరేకమనే ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పార్టీ ప్రజా ప్రతినిధులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. ఉద్యమకాలం నుంచి యువత తెరాస వైపే ఉందని సీఎం పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజల్లో ఉండి.. సమస్యలు పరిష్కరిస్తూ మంచి నేతలుగా ఎదగాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రజల్లో నమ్మకం సాధిస్తే.. ప్రతి ఎన్నికల్లోనూ గెలిచే పరిస్థితి ఉంటుందన్నారు.