CM KCR meets Farmer Union Leaders: రాష్ట్రంలో వ్యవసాయరంగం, రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అధ్యయనం చేసేందుకు వచ్చిన రైతు సంఘాల నేతలు, ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. 26 రాష్ట్రాలకు చెందిన 100 మంది రైతు సంఘాల నేతలు, ప్రతినిధులు శుక్రవారం రాష్ట్రానికి వచ్చారు. ఇవాళ ప్రగతిభవన్‌కు వచ్చిన నేతలు వ్యవసాయం, సాగునీటి రంగం తదితర తెలంగాణ ప్రగతిపై రూపొందించిన డాక్యుమెంటరీని తిలకించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన రైతు సదస్సులో పాల్గొన్నారు.
ప్రగతిభవన్‌కు వచ్చిన రైతు సంఘాల నేతలు Farmer Union Leaders Meets KCR in Hyderabad : దేశంలో నెలకొన్న వ్యవసాయరంగ పరిస్థితులతో పాటు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలు, అనుబంధ రంగాల పురోగతిపై సదస్సులో చర్చిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలు, ఆలోచనలు, భవిష్యత్ కార్యాచరణ, దేశ వ్యవసాయ రంగంలో రావాల్సిన మార్పులు, రైతుల కోసం తీసుకోవాల్సిన చర్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంఘాల నేతలకు వివరిస్తున్నారు. నేతల అభిప్రాయాలనూ కేసీఆర్ పరిగణలోనికి తీసుకోకున్నారు.
కేసీఆర్ దేశానికే రైతు బాంధవుడు..: అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ, వ్యవసాయాభివృద్ధి పథకాలు, విధానాలను అమలు చేసేలా తమ రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తామని రైతు సంఘాల నేతలు చెప్పారు. కేసీఆర్ వంటి ముఖ్యమంత్రి తమకూ ఉంటే బాగుండేదన్నారు. తెలంగాణ రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా కొనసాగించడం ఆశ్చర్యం అనిపించిందని వారు అన్నారు. కేసీఆర్ రైతుబంధు కింద ఎకరానికి రూ.10 వేలు, రైతుబీమా పథకంలో రూ.5 లక్షల సాయం అందించడం దేశ చరిత్రలోనే గొప్ప పరిణామని ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రైతు నాయకుడు హిమాంశ్ పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణకే కాదు, దేశానికే రైతు బాంధవుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉత్తర్‌ప్రదేశ్, ఝార్ఖండ్, ఒడిశా, పంజాబ్, కర్ణాటక తదితర 26 రాష్ట్రాలకు చెందిన రైతులు దాదాపు 100 మంది పాల్గొన్నారు.
మల్లన్నసాగర్ అద్భుతం..: మల్లన్నసాగర్ అద్భుతమని జాతీయ రైతు సంఘం నాయకులు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని మల్లన్నసాగర్‌ను శుక్రవారం వారు సందర్శించారు. రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు గోదావరి జలాల ఎత్తిపోతల పథకం గురించి వారికి వివరించారు. అనంతరం సింగాయిపల్లి అటవీ ప్రాంతాన్ని సందర్శించారు.