CM KCR Meeting with BRS MLA Candidates :ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల అనంతరం తొలిసారి తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంపై అభ్యర్థులకు కీలక సూచనలు చేశారు. ఈ క్రమంలోనే న్యాయపరమైన అంశాల వల్లే కొన్ని చోట్ల అభ్యర్థులను మార్చాల్సి వచ్చిందని కేసీఆర్ పేర్కొన్నారు. వేములవాడలో వాస్తవానికి మార్చాల్సిన అవసరం లేదని.. న్యాయపరమైన అంశాల వల్ల అక్కడ అభ్యర్థిని మార్చామని తెలిపారు. మార్పులు, చేర్పులన్నీ సానుకూలంగా జరిగాయన్న కేసీఆర్.. ఎన్నికల వేళ కొన్ని కోపతాపాలు ఉండటం సహజమేనని తెలిపారు. ఈ సమయంలో అభ్యర్థులకు ఓపిక, సంయమనం అవసరమని.. అందరూ నాయకులను కలుపుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
"న్యాయపరమైన అంశాల వల్లే సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాల్లో కొన్నిచోట్ల మార్పులు చేయాల్సి వచ్చింది. వేములవాడలో వాస్తవానికి మార్చాల్సిన అవసరం లేదు. న్యాయపరమైన అంశాల వల్ల వేములవాడలో మార్చాం. మార్పులు, చేర్పులు అన్నీ సానుకూలంగా జరిగాయి. ఎన్నికల వేళ కొన్ని కోపతాపాలు ఉంటాయి.. అది సహజమే. ఈ సమయంలో అభ్యర్థులకు ఓపిక, సంయమనం అవసరం. అందరు నాయకులను కలుపుకుని పోవాలి." - సీఎం కేసీఆర్
B Forms To BRS MLA Candidates 2023 : మరోవైపు.. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన బీఆర్‌ఎస్ నాయకులపై గతంలో కొన్ని కేసులు పెట్టారని కేసీఆర్ గుర్తు చేశారు. మన పార్టీ వాళ్లు గెలిచినా.. సాంకేతికంగా ఇబ్బంది పెడతారని తెలిపారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు వంటి నాయకుల విషయంలో అలా జరిగిందని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే నామినేషన్ వేసే సమయంలో ఏమైనా సందేహాలు ఉంటే న్యాయ బృందాన్ని సంప్రదించాలని సూచించారు. ఒక్కో అభ్యర్థికి రెండు చొప్పున నేడు, రేపు బీ ఫారాలు అందజేస్తామని.. నామినేషన్ల విషయంలో అజాగ్రత్త వద్దని కేసీఆర్ స్పష్టం చేశారు.