CM KCR Meeting with Maharashtra Leaders: మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించనుందని.. ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. మరాఠగడ్డపై బీఆర్ఎస్కి పెరుగుతున్న ఆదరణకు రాజకీయ పార్టీలు బెంబేలెత్తిపోతున్నాయన్న గులాబీ దళపతి.. అది వ్యక్తి విజయం కాదని అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాద బలమని పేర్కొన్నారు. బీఆర్ఎస్లో చేరేందుకు మహారాష్ట్ర సిట్టింగ్ ఎమ్మెల్యేలు అనేక మంది తనతో సంప్రదింపులు చేస్తున్నారని పార్టీ విస్తరణ వ్యూహాలపై ఆ రాష్ట్ర నాయకులతో నిర్వహించిన చర్చలో వివరించారు.
KCR Meeting at Telangana Bhavan: అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదం బీఆర్ఎస్ సిద్ధాంతాలు.. లక్ష్యాన్ని ప్రజలకుచేర్చి వారిప్రేమ పొందాలని నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రజల మనసు గెలిచే క్రమంలో వ్యక్తిగత విమర్శలకు తావుఇవ్వద్దని సూచించారు. భారత్ రాష్ట్ర సమితి ఆత్మస్థైర్యం, మనోనిబ్బరం, సంకల్పసిద్ధి, చిత్తశుద్ధి, కార్యాచరణ మహోన్నతమైనదని.. ఆక్రమంలో లక్ష్యం నుంచి ఎవరూ తప్పుకోవద్దని దిశానిర్దేశం చేశారు. వ్యక్తులు ముఖ్యం కాదు.. పార్టీనే ముఖ్యమన్నారు. పదవులు వచ్చేవరకు పాదాలు పట్టుకొని ప్రార్థించి పదవిరాగానే కళ్లునెత్తికిపోయే పరిస్థితి బీఆర్ఎస్లో ఉండదని కేసీఆర్ స్పష్టం చేశారు.
నియామకం పూర్తి చేస్తాం: దేశాన్ని మలుపు తిప్పే అవకాశం తెలంగాణ తర్వాత మహారాష్ట్రకే వచ్చిందని.. సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జీల నియామకం దాదాపు పూర్తైందన్న కేసీఆర్.. రెండు మూడు రోజుల్లో జిల్లా సమన్వయకర్తల నియామకం పూర్తి చేస్తామని తెలిపారు. ఈనెల 10 నుంచి జూన్ 10 వరకు పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు.
ఒకే రోజు ఒకే సమయంలో 288 నియోజకవర్గ కేంద్రాల నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణం ప్రారంభం కావాలని తెలిపారు. శివాజీ, అంబేడ్కర్ విగ్రహాల నుంచే బీఆర్ఎస్ కార్యక్రమం మొదలు కావాలని కేసీఆర్ సూచించారు. ఈనెల 8, 9న మహారాష్ట్ర నాయకులకు తెలంగాణ భవన్‌లో శిక్షణా శిబిరాలు నిర్వహించనున్నట్లు గులాబీ దళపతి చెప్పారు. బీఆర్ఎస్ సాధారణ సభ్యత్వానికి 10 రూపాయలు క్రియాశీల సభ్యత్వానికి 50 రూపాయలు చెల్లించాలని తెలిపారు.