భారతీయ జీవిక, దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యవసాయ రంగం లాభదాయకమైనది కాదనే వ్యతిరేక ధోరణిలో మార్పు రావాలని సీఎం కేసీఆర్ తెలిపారు. భారతదేశానిది వ్యవసాయాధారిత ఆర్థికవ్యవస్థ కావడం వల్లే ఆటుపోట్లు తట్టుకుని నిలబడుతోందని పేర్కొన్నారు. రైతులు సామూహిక వ్యవసాయం చేసేలా ప్రోత్సహించడంతో పాటు పంటలు ప్రాసెస్ చేసి అమ్మేందుకు అవసరమైన యంత్రాలను అందించాలన్నారు.
ప్రగతి భవన్‌లో గురువారం నాబార్డు ఛైర్మన్ జి.ఆర్.చింతల ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందంతో సీఎం సమావేశమై, వ్యవసాయ రంగ అభివృద్ధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించడంతో పాటు విదేశాలకు అవసరమయ్యే ఆహార పదార్థాలు అందించే స్థాయికి చేరాలని కేసీఆర్ ఆకాక్షించారు. దేశంలో ఎక్కువ మంది ఆధారపడుతున్న, అందరికీ ఆహారాన్ని అందించడంతో పాటు పరిశ్రమలకు అవసరమైన ముడిసరకును అందిస్తున్నది వ్యవసాయ రంగమేనని, దీనికి మరిన్ని ప్రోత్సాహకాలు అందించాలని పేర్కొన్నారు. వ్యవసాయాభివృద్ధికి కృషి చేయడంతో పాటు వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం, నాబార్డు లాంటి సంస్థలు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయాలని సీఎం కోరారు.
స్వయం సమృద్ధి సాధించాలి
‘దేశంలోని 135 కోట్ల మందికి అన్నం పెట్టేది రైతులే. వ్యవసాయంపై ఆధారపడి 15 కోట్ల కుటుంబాలు జీవిస్తున్నాయి. ఇంత జనాభా కలిగిన దేశానికి ప్రపంచంలో మరో దేశమేదీ తిండిపెట్టలేదు. అందుకే దేశం ఆహారోత్పత్తుల విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి. వివిధ దేశాల్లో ఆహార అవసరాలు గుర్తించి, మన దేశం నుంచి ఎగుమతి చేసే విధానం రావాలి. ఈ మేరకు నాబార్డు అధ్యయనం చేయాలి’ అని సీఎం తెలిపారు.