తెలంగాణ

telangana

ETV Bharat / state

Cm Meet with Ministers: సమరశంఖం పూరిద్దాం.. మంత్రుల భేటీలో సీఎం కేసీఆర్‌

ధాన్యం కొనుగోళ్ల అంశంలో కేంద్రంపై పోరాటాన్ని తారాస్థాయికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. దిల్లీ వెళ్లి వచ్చిన మంత్రులతో సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజలను కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అవమానించారని కేసీఆర్‌ దుయ్యబట్టారు. వడ్ల కొనుగోళ్లపై ఊరూరా తీర్మానాలు చేయాలని ఉగాది తర్వాత దిల్లీ వెళ్లి ధర్నాకు దిగుదామని తెలిపారు. భవిష్యత్‌ కార్యాచరణను మంత్రులు ఇవాళ ప్రకటించనున్నారు.

Cm Meet with Ministers
మంత్రుల భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

By

Published : Mar 26, 2022, 4:46 AM IST

Updated : Mar 26, 2022, 5:14 AM IST

యాసంగి ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌తో చర్చించి హైదరాబాద్ తిరిగి వచ్చిన మంత్రులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుదీర్ఘ చర్చలు జరిపారు. మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌తో... దాదాపు ఏడు గంటలపాటు సమాలోచనలు చేశారు. పీయూష్‌ గోయల్‌తో జరిపిన చర్చల వివరాలు, ఆయన చేసిన వ్యాఖ్యలను మంత్రులు ముఖ్యమంత్రికి వివరించారు. తెలంగాణ ప్రజలకు నూకలు అలవాటు చేయాలని తెరాస కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ధాన్యం సేకరణ విధానం మార్చాలంటూ గోయల్‌ చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. పీయూష్‌ వ్యాఖ్యలు రాష్ట్రాన్ని, ప్రజలను అవమానపరచడమేనని వ్యాఖ్యానించినట్లు సమాచారం. కేంద్రం తెలంగాణపై కక్షగట్టినట్లు వ్యవహరిస్తోందని రాజకీయ కారణాలతో తమ ధర్మాన్ని విస్మరిస్తోందని అన్నట్లు తెలిసింది. పంజాబ్‌ తరహా విధానం తెలంగాణలో అమలు చేయడానికి ఆటంకాలేమీ లేవని కేంద్రం సేకరణకు ముందుకొస్తే సహకరించేందుకు సిద్ధమన్నారు. కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌ పక్కా వ్యాపారిగా నిరూపించుకుంటున్నారని కేసీఆర్‌ అన్నట్లు సమాచారం.

విన్నపాలను వినే పరిస్థితిలో కేంద్రం లేదనిపోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కేంద్రమంత్రితో చర్చలు ఫలవంతం కానందున ఇక ప్రధానమంత్రి పరిధిలోకే ఈ అంశాన్ని తీసుకెళ్లి ప్రయత్నించాలని అన్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో తదుపరి అనుసరించాల్సిన కార్యాచరణపై కూడా సమావేశంలో చర్చించారు. కేంద్ర ప్రభుత్వంపై మరింతగా ఒత్తిడి పెంచాల్సిందేనని కేసీఆర్ స్పష్టం చేసినట్లు తెలిసింది.

క్షేత్రస్థాయి నుంచి తీర్మానాలు చేసి ప్రధానమంత్రికి పంపాలని గతంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అన్ని స్థాయిలో ఇవాళ్టి నుంచి అమలు చేయాలని చెప్పారు. ఏప్రిల్ రెండో తేదీ వరకు ఇచ్చిన కార్యాచరణకు అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. నలుగురు మంత్రులు ఈ ఉదయం మీడియా సమావేశం నిర్వహించి అందుకు సంబంధించిన ప్రకటన చేయనున్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశంతో పాటు రిజర్వేషన్ల పెంపు అంశానికి సంబంధించి కేంద్రం వైఖరి విషయమై కూడా సమావేశంలో చర్చ జరిగింది. రాజకీయ అంశాలపై కూడా మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రులు శనివారం తెలంగాణ భవన్‌లో దిల్లీలోని పరిస్థితులు, రాష్ట్రంలో ఆందోళనలపై విలేకరుల సమావేశంలో వివరించనున్నట్లు సమాచారం.


కేంద్రంపై పోరు ఉద్ధృతం చేద్దాం. బహుముఖ ఒత్తిడి పెంచుదాం. పంజాబ్‌ తరహాలో ధాన్యం సేకరణ చేపట్టాలని అన్ని గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లాపరిషత్‌లు, రైతుబంధు సమితులు, మార్కెట్‌ కమిటీలు, ఆత్మ కమిటీలు, పురపాలక సంఘాల్లో తీర్మానాలు చేసి ప్రధాని మోదీకి పంపుదాం. పార్లమెంటులోనూ ఎంపీలు నిరసన తెలియజేస్తారు. రాష్ట్రంలో దశల వారీగా ఆందోళనలు కొనసాగిద్దాం. వచ్చే నెల రెండో తేదీ తర్వాత దిల్లీకి వెళ్లి ధర్నా చేద్దాం. ఈ పోరాటంలో ఇతర పార్టీల మద్దతు తీసుకుందాం. పోరాటం తీవ్రస్థాయికి చేరాలి. ఇందులో అన్నదాతలను భాగస్వాములను చేద్దాం. ఆందోళనలతో దిల్లీలో ప్రకంపనలు పుట్టిద్దాం. గిరిజన రిజర్వేషన్ల అంశంలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెద్దాం. విభజన హామీల అమలుపైనా నిలదీద్దాం. ఉగాది తరువాత కేంద్రం మెడలు వంచేలా కార్యాచరణ ఉంటుంది’’ - కేసీఆర్, సీఎం



‘‘కేంద్రం రైతాంగంపై పూర్తి నిర్దయతో ఉంది. కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌ మానవత్వం మరిచి మాట్లాడుతున్నారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించారు. పరిస్థితిని ఏ మాత్రం అర్థం చేసుకోవడం లేదు. రాష్ట్ర భాజపా నేతలు ఏమి చెబితే అదే చెబుతున్నారు తప్ప కనీస విషయపరిజ్ఞానం లేదు. కేంద్రం వైఫల్యాలను రాష్ట్రంపై రుద్దాలని చూస్తున్నారు’’- మంత్రులు

ఇదీ చూడండి:
KCR Meeting With Ministers : కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచాలి: సీఎం కేసీఆర్

Last Updated : Mar 26, 2022, 5:14 AM IST

ABOUT THE AUTHOR

...view details