తెలంగాణ

telangana

ETV Bharat / state

అసెంబ్లీ అంటే అల్లర్లు, దూషణలు కాదు: సీఎం కేసీఆర్​

By

Published : Sep 3, 2020, 6:59 PM IST

Updated : Sep 3, 2020, 7:54 PM IST

అసెంబ్లీ అంటే అల్లర్లు, దూషణలు కాదు: సీఎం కేసీఆర్​
అసెంబ్లీ అంటే అల్లర్లు, దూషణలు కాదు: సీఎం కేసీఆర్​

18:54 September 03

అసెంబ్లీ అంటే అల్లర్లు, దూషణలు కాదు: సీఎం కేసీఆర్​

వర్షాకాల సమావేశాలు ఎన్ని రోజులు జరిగినా సరే ప్రతిపాదించిన అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధమని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు. అసెంబ్లీ అంటే అల్లర్లు, దూషణలు, గందరగోళం, తిట్లు, శాపనార్థాలు కాదన్నారు. వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. మంత్రులు, చీఫ్ విప్‌లు, విప్‌లతో సీఎం కేసీఆర్​ సమావేశమయ్యారు.  

అన్ని అంశాలపై కూలంకషంగా చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటోందని కేసీఆర్​ తెలిపారు. ఎన్ని రోజులైనా సరే ప్రతిపాదించిన అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధమని వెల్లడించారు. వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు మంత్రులు సిద్ధం కావాలని సూచించారు. అన్ని అంశాలపై సంపూర్ణమైన సమాచారంతో మంత్రులు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రజాస్వామ్య విలువలు పరిఢవిల్లేలా శాసనసభ సమావేశాలు జరగాలని కోరారు. దేశానికి ఆదర్శంగా ఉండేలా తెలంగాణ శాసనసభను నిర్వహించాలని సీఎం ఆదేశించారు.  

పథకాలు, చట్టాలు అమలు క్షేత్రస్థాయిలో ఎలా ఉందో సభ్యులు విశ్లేషించాలని సీఎం ఆదేశించారు. వాటి అమల్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే సభ్యులు ప్రస్తావించాలన్నారు. సభ్యులడిగే ప్రతి అంశానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వం చెబుతుందని వెల్లడించారు. అధికార పక్ష సభ్యులు కూడా ప్రజలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించాలని సీఎం కోరారు.  

"అసెంబ్లీ అంటే అల్లర్లు, దూషణలు, గందరగోళం, తిట్లు, శాపనార్థాలు కాదు. పనికిమాలిన నిందలు, అసహనం ప్రదర్శించేందుకు అసెంబ్లీ వేదిక కారాదు. అలాంటి ధోరణిలో మార్పు రావాలి. అసెంబ్లీ నిర్వహణలో గుణాత్మక మార్పులు రావాలి. ప్రజలకు ఉపయోగపడేలా సభ్యులు మాట్లాడాలి. అసెంబ్లీలో చర్చ ద్వారా ప్రజాస్వామ్యం మరింత బలపడాలి. ఆచరణాత్మకమైన సూచనలు స్వీకరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధమే."

-సీఎం కేసీఆర్​

ప్రభుత్వ పరంగా చర్చకు ప్రతిపాదించనున్న అంశాలు:  

ఇటీవల మరణించిన దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డికి అసెంబ్లీలో మొదటి రోజే నివాళి అర్పించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వ పరంగా బీఏసీలో ప్రతిపాదించాల్సిన అంశాలను సమావేశంలో నిర్ణయించారు. కరోనా వ్యాప్తి నివారణ, కొవిడ్ బాధితులకు అందుతున్న వైద్యం, రాష్ట్రంలో విస్తరించిన వైద్య సేవలు, భారీ వర్షాల వల్ల జరిగిన పంట నష్టం, తీసుకోవాల్సిన చర్యలను ప్రతిపాదించనున్నట్లు సమాచారం.  

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం, విద్యుత్ రంగంలో సాధించిన విజయాలు, కొత్త రెవెన్యూ చట్టం, రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టు, నీటి పారుదల రంగానికి సంబంధించిన అంశాలను ప్రస్తావనకు తేనున్నారు. జీఎస్టీ అమలులో జరుగుతున్న అన్యాయం, కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ఆర్థిక విధానాల వల్ల కలుగుతున్న నష్టం, రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నాన్చివేత ధోరణి, నియంత్రితసాగుతో పాటు వ్యవసాయ రంగం, పీవీ శతజయంతి ఉత్సవాలను ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది.  

ఇదీ చూడండి:ఆసిఫాబాద్‌లో రెండోరోజు డీజీపీ మహేందర్​రెడ్డి పర్యటన

Last Updated : Sep 3, 2020, 7:54 PM IST

ABOUT THE AUTHOR

...view details