సినీ పరిశ్రమ కోసం త్వరలోనే కొత్త పాలసీ తీసుకువస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. విలువలతో కూడిన ఎన్నో గొప్ప చిత్రాలు తీసిన దర్శకుడు కె.విశ్వనాథ్ అని ప్రశంసించారు. ఆయన ఆధ్వర్యంలో సమాజానికి మంచి సందేశం అందించే మరో చిత్రం రావాలని సీఎం ఆకాంక్షించారు. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని కళాతపస్వి నివాసానికి వెళ్లిన కేసీఆర్... మర్యాద పూర్వకంగా కలిశారు. విశ్వనాథ్ దంపతులను పట్టువస్త్రాలతో సన్మానించారు. మళ్లీ సినిమాలు తీస్తే, నిర్మాణ పరమైన విషయాలు తాను చూసుకుంటానని మాటిచ్చారు.
భాష, సాహిత్య అంశాలపై చర్చ
సినిమాలు, భాష, సాహిత్యం తదితర అంశాలపై సీఎం కేసీఆర్, విశ్వనాథ్ మధ్య గంటకు పైగా ఆసక్తికర చర్చ జరిగింది. చిన్నప్పటి నుంచి విశ్వనాథ్ అంటే ఎనలేని అభిమానమని కేసీఆర్ అన్నారు. శంకరాభరణం 25సార్లకు పైగా చూశానని... సినిమా చూసిన ప్రతిసారి ఆయనను కలవాలని అనిపించేదని తెలిపారు. ఇన్నాళ్లకు ఆ కోరిక తీరిందంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఆయన దర్శకత్వం వహించిన ప్రతి చిత్రం ఓ కావ్యంగా ఉంటుందని ప్రశంసించారు. కళాకారుల ఎంపిక గానీ, సాహిత్యం, సంగీతం, సన్నివేశాల చిత్రీకరణ గొప్పగా ఉంటుందని అభినందించారు. సందేశాత్మక, గొప్ప సినిమాలు ఈ మధ్య రావడం లేదని... మళ్లీ సినిమా తీయాలని విశ్వనాథ్‌ను సీఎం కోరగా... వయోభారం వల్ల తీయలేనని కళాతపస్వి సున్నితంగా తిరస్కరించారు.