CM KCR Maharashtra Tour Updates :మహారాష్ట్రలో భారత్ రాష్ట్ర సమితిని విస్తరిస్తున్న సీఎం కేసీఆర్.. భారీ కాన్వాయ్‌తో సోమవారం సోలాపూర్‌కు చేరుకున్నారు. పార్టీ బలోపేతం సహా.. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలతో కలిసి 2 బస్సులు, 600 కార్లతో కూడిన భారీ వాహనశ్రేణితో ముఖ్యమంత్రి బయలుదేరి వెళ్లారు. రెండు రోజుల పాటు ఆయన అక్కడ పర్యటించనున్నారు. సీఎం వెళ్తున్న మార్గంలో.. బీఆర్‌ఎస్ కార్యకర్తలు పూలుజల్లుతూ ఘన స్వాగతం పలికారు.
BRS Meeting in Solapur Today : మహారాష్ట్రలోని సోలాపూర్ చేరుకున్న కేసీఆర్‌కు అక్కడి బీఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. సోలాపూర్‌కు చెందిన నేత భగీరథ బాల్కే.. ఇతరులు బీఆర్‌ఎస్‌లో చేరారు. కొందరు స్థానిక నేతలు, తెలంగాణ నుంచి వలస వెళ్లిన చేనేత కుటుంబాలు కేసీఆర్‌ను కలిశాయి. సోలాపూర్‌లో కాంగ్రెస్ మాజీ ఎంపీ ధర్మన్న సాదుల్ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంకు ఘనస్వాగతం పలికిన సాదుల్.. కుటుంబసభ్యులను పరిచయం చేశారు.
CM KCR Maharashtra Tour Latest Updates :రాత్రి సోలాపుర్‌లో బస చేసిన కేసీఆర్, నేతలు.. ఇవాళ ఉదయం పండరీపురం వెళ్లనున్నారు. అక్కడి విట్టల్ రుక్మిణీ దేవస్థానాన్ని సందర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విఠలేశ్వరునికి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం అక్కడి నుంచి సర్కోలి వెళ్తారు. అక్కడబీఆర్‌ఎస్ సభలో కేసీఆర్ పాల్గొంటారు. సోలాపూర్ జిల్లాకు చెందిన భగీరథ్ బాల్కే సహా పలువురు నేతలు బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. అనంతరం సీఎం కేసీఆర్, నేతలు తుల్జాపూర్ వెళ్లి.. తుల్జాభవానీ అమ్మవారి దేవస్థానానికి చేరుకొని పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నేరుగా హైదరాబాద్‌కు తిరుగు పయనం అవుతారు.
మరాఠా రైతులతో తలసాని మాటామంతీ.. :ఇదిలా ఉండగా.. సోమవారం రోజున కేసీఆర్ వెంట సోలాపూర్ పర్యటనకు వెళ్తున్న క్రమంలో మహారాష్ట్ర రైతులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాటామంతి కలిపారు. మార్గమధ్యలో ఆ ప్రాంతానికి చెందిన రైతులతో మంత్రి ముచ్చటించారు. కేసీఆర్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల విద్యుత్ సరఫరా, ఏటా పంట పెట్టుబడి కోసం ఎకరాకు రూ.10 వేల ఆర్థిక సాయం వంటి అంశాలు రైతుల వద్ద ప్రస్తావించారు. తమ రాష్ట్రంలో అలాంటి పథకాలు ఏవీ లేవని మహారాష్ట్ర రైతులు మంత్రికి వివరించారు. రానున్న ఎన్నికల్లో మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ను గెలిపించుకుంటామని.. రైతులు సంతోషంగా చెప్పారని మంత్రి తలసాని పేర్కొన్నారు.