Hyderabad Second Phase Metro Works: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో రైలు సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ మెట్రో నిర్మాణానికి డిసెంబర్ 9న ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ కూడా ట్విట్టర్‌లో వెల్లడించారు. బయో డైవర్సిటీ జంక్షన్, కాజాగూడ రోడ్డు ద్వారా ఔటర్ రింగ్ రోడ్డు వద్ద గల నానక్‌రామ్‌గూడ జంక్షన్ మీదుగా ఈ మార్గం వెళ్లనుంది. 31 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గాన్ని 6వేల 250 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టనున్నట్లు సీఎం వెల్లడించారు.
మెట్రో విస్తరణకు ముహుర్తం ఫిక్స్.. ఎయిర్‌పోర్టుకు వెళ్లే వారికి తీరనున్న కష్టాలు
07:31 November 28
15:02 November 27
మెట్రో రైలు రెండో విడత పనులకు భూమిపూజ.. డిసెంబర్ 9న ముహూర్తం
హైదరాబాద్ భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఏ మూల నుంచైనా శంషాబాద్ విమానాశ్రయానికి తక్కువ సమయంలో చేరుకునేలా రూపకల్పన చేసినట్లు తెలిపారు. మెట్రో రైలు విస్తరణతో మరిన్ని పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారుతుందని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు.రెండో దశలో చేపట్టనున్న 31 కిలోమీటర్ల మార్గం ద్వారా ఎయిర్‌పోర్టుకు 25 నిమిషాల్లో విమానాశ్రయాన్ని చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనావేస్తున్నారు. ఇందులో 2.6 కిలోమీటర్లు భూగర్భం నుంచి వెళ్లే అవకాశం ఉంది. మూడేళ్లలోఈ మార్గాన్ని పూర్తిచేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.
మెట్రో ప్రారంభమై ఐదు ఏళ్లు పూర్తి:మెట్రో రెండోదశకు ఆర్థిక తోడ్పాటును అందించాలని మంత్రి కేటీఆర్ ఇటీవల కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీకి లేఖ రాశారు. 31 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించాలనుకుంటున్నట్లు తెలిపారు. బీహెచ్ఈఎల్- లక్డీకాపూల్, నాగోల్ -ఎల్బీనగర్ కారిడార్ నిర్మాణానికి 8వేల 453 కోట్ల రూపాయలవుతుందని.. ప్రతిపాదనలకు సూత్రప్రాయ అంగీకారం తెలిపి రానున్న బడ్జెట్‌లో నిధులివ్వాలని కేటీఆర్ కోరారు. మరోవైపు హైదరాబాద్ ప్రజారవాణాను సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లిన మెట్రోరైల్ తొలి దశ ప్రారంభమై 5 ఏళ్లు పూర్తయింది.
ఇప్పటి వరకు ప్రయాణికులు 35 కోట్ల మంది:ఇప్పటి వరకు 12 లక్షల ట్రిప్పులకు గాను 35 కోట్ల మంది ప్రయాణించారు. నాగోల్ నుంచి అమీర్ పేట్ వరకు 16.8కిలోమీటర్లు, అమీర్ పేట్ నుంచి మియాపూర్ వరకు 11.3కిలో మీటర్ల మార్గాన్ని 2017 నవంబర్ 28న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. 29 తేదీ నుంచి సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాత అమీర్‌పేట్ - ఎల్బీనగర్ వరకు 16.8 కిలోమీటర్ల మార్గాన్ని 2018 సెప్టెంబర్ 24 న అప్పటి గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. అమీర్ పేట్ -హైటెక్ సిటీ వరకు 8.5కిలో మీటర్ల మార్గాన్ని 2019 మార్చి 20న గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. హైటెక్ నుంచి రాయదుర్గం వరకు 1.5 కిలోమీటర్ల మార్గాన్ని 2019 నవంబర్ 29న మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
రోజుకు 4 లక్షల మంది ప్రయాణం:జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు 11కిలో మీటర్ల మార్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ 2020 ఫిబ్రవరి 7న ప్రారంభించారు. దీంతో ప్రస్తుతం 69.2 కిలో మీటర్ల వరకు సిటిలో మెట్రో అందుబాటులోకి వచ్చింది. 3 మెట్రో కారిడార్లలో 57 స్టేషన్ల ద్వారా మెట్రో రైళ్ల రాకపోకలు సాగుతుండగా.. రోజుకు 4 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అయితే మెట్రో ప్రయాణికులకు కొన్ని ఇబ్బందులు వెంటాడుతున్నాయి. పార్కింగ్ కష్టాలతో పాటు.. మెట్రో ఆల్ ఇన్ వన్ కార్డులు ప్రవేశపెట్టకపోవటంతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. తరచు మెట్రో సేవల్లో అంతరాయం కూడా ప్రయాణికులకు అసహనానికి గురిచేస్తోంది. మెట్రో ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనే ప్రకటన పూర్తిస్థాయిలో ఆచరణకు నోచుకోలేదు.
ఇవీ చదవండి: