TRSPP Meeting: కేంద్రంలో భాజపా ఆధ్వర్యంలోని ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని తెరాస నిర్ణయించింది. పార్లమెంటు సమావేశాల్లో తెరాస సత్తా చూపాలని, దేంట్లోనూ వెనక్కి తగ్గకూడదని, రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలపై పార్లమెంటు లోపలా.. బయటా గట్టిగా పోరాడాలని, బలమైన వాణి వినిపించాలని తీర్మానించింది. ఆదివారం ప్రగతిభవన్‌లో జరిగిన తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. సుమారు అయిదున్నర గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు. భాజపాతో ఇక యుద్ధమేనని, అమీతుమీ తేల్చుకుందామని ఈ సందర్భంగా సీఎం వారికి చెప్పారు. తెరాస ధర్నాలతో పార్లమెంటుతో పాటు దేశం మొత్తం దద్దరిల్లాలన్నారు. పట్టుపడితే తానేమి చేస్తానో, తన బలమేమిటో ప్రధానమంత్రి మోదీకి తెలుసని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసం తీవ్ర ఒత్తిడి తేవాలన్నారు. భాజపా ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం గత ఏడున్నరేళ్లుగా తెలంగాణకు చేసిందేమీ లేదని, రాష్ట్రంపై కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందని, విభజన హామీలను పూర్తిగా విస్మరించిందని కేసీఆర్ విమర్శించారు.
ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి కేంద్ర ప్రభుత్వం ఉండడం దురదృష్టకరం. గత ఏడున్నర సంవత్సరాలుగా ప్రతి బడ్జెట్ సమయంలో రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరుతున్నా ఏం మాత్రం పట్టింపు లేదు. పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నట్లు తెలంగాణలోని ఏదైనా ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరుతున్నా మొండిచేయి చూపింది. ఏపీలో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చింది. కేంద్రం, ఏపీ ప్రభుత్వ వైఖరి కారణంగా షెడ్యూల్ 9,10లోని ప్రభుత్వ సంస్థల విభజన ఇంకా అసంపూర్తిగానే ఉంది. రాష్ట్రంలో శాసనసభ స్థానాల పునర్విభజన ప్రక్రియ కాగితాలకే పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు ప్రకారం తెలంగాణలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఏటా కేంద్రం ఇవ్వాల్సిన రూ.450 కోట్లలో ఒక ఏడాది బకాయిలు ఇంకా ఇవ్వలేదు. హైదరాబాద్‌లో ప్రతిపాదించిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్.ఐ.డి.)ను రాష్ట్ర పునర్విభజన తర్వాత విశాఖపట్నానికి తరలించారు. రాష్ట్రానికి ఒక్క వైద్యకళాశాల కూడా మంజూరు చేయలేదు. రాష్ట్రంలోని గిరిజనులు, ముస్లింల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ కోసం శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసి పంపినా స్పందన లేదు. ధాన్యం సేకరణకు సంబంధించి యాసంగిపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల విషయంలోనూ నిబంధనలను సవరించి, రాష్ట్రాల పాలనలో జోక్యానికి పూనుకుంది. దేశాన్ని పాలించేది ఇలాగేనా? భాజపా ప్రభుత్వంపై వ్యతిరేకత దేశవ్యాప్తంగా ఉంది. అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో అది ప్రస్ఫుటమవుతుంది. ఆ పార్టీ ఓటమిపై ఇప్పటికే కేంద్ర నిఘా సంస్థలు నివేదికలు ఇచ్చాయి. -సీఎం కేసీఆర్
బడ్జెట్‌పై ఆశల్లేవు