CM KCR inspect Secretariat: సచివాలయ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. మంత్రులు ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, అధికారులతో కలిసి సాయంత్రం సచివాలయ ప్రాంగణానికి వచ్చిన సీఎం... గంటన్నర పాటు పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న భవనంలోకి వెళ్లిన ముఖ్యమంత్రి... రెండస్తుల వరకు వెళ్లి పరిశీలించారు. పనుల పురోగతిని ఆరా తీశారు. పనులు జరుగుతున్న తీరు, పూర్తయ్యే సమయాలను అధికారులు, ఇంజినీర్లు సీఎంకు వివరించారు. భవనం పశ్చిమ భాగాన ఇప్పటికే ఐదంతస్తుల వరకు స్లాబు పనులు పూర్తి కాగా... ఆరో అంతస్తు స్లాబు పనులు కొనసాగుతున్నాయి. ముందు భాగంలో మూడో స్లాబు పనులు జరుగుతున్నాయి. రెండంతస్తుల వరకు గోడల పనులు కూడా పూర్తయ్యాయి.
అధికారులు, ఇంజినీర్లకు అభినందన
మార్చి నెలాఖరు వరకల్లా స్ట్రక్చర్ పనులు పూర్తి చేస్తామని అధికారులు, ఇంజినీర్లు వివరించారు. మొదటి రెండంతుస్తుల్లో మంత్రుల ఛాంబర్లలోని గదులు, సీలింగ్ తదితరాల గురించి ముఖ్యమంత్రి ఆరా తీశారు. పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్... ఆర్ అండ్ బీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, అధికారులు, ఇంజినీర్లు, సిబ్బందిని అభినందించారు. భవన నిర్మాణంలో వినియోగించే రాళ్లు, టైల్స్, గ్రానైట్లు, మార్బుల్స్ సహా ఇతర సామాగ్రిని ముఖ్యమంత్రి పరిశీలించారు. వివిధ కంపెనీలకు చెందిన టైల్స్, మార్బుల్స్, గ్రానైట్స్ను మొదటి అంతస్తులో ప్రదర్శించారు. వివిధ ప్రాంతాల్లో ఉపయోగించాల్సిన వాటిని సీఎం కేసీఆర్ ఎంపిక చేసినట్లు తెలిసింది.