CM KCR Inaugurate Nagpur BRS Party Office : జాతీయ పార్టీగా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్న భారత రాష్ట్ర సమితి మహారాష్ట్రలో విస్తరణకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు నాగ్‌పుర్‌లో నిర్మించిన బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. త్వరలో ముంబయి, ఔరంగాబాద్, పుణెలోనూ పార్టీ కార్యాలయాలు తెరిచేందుకు గులాబీ నాయకత్వం సన్నాహాలు చేస్తోంది. పార్టీ నిర్మాణంలో భాగంగా సభ్యత్వం డ్రైవ్, కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు.
CM KCR Comments at Nagpur Meeting : పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు, సామాజిక కార్యకర్తలు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్.. ప్రతిపక్షాలపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. భారత దేశానికి ఏమైనా లక్ష్యం ఉందా అని ప్రశ్నించిన సీఎం... లక్ష్యం లేని దేశం ఎక్కడకు వెళ్తుందన్నారు. ఈ విషయం ఆలోచిస్తే తనకు భయం వేస్తోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఎంతో మంది సీఎంలు మారినా... ప్రజల దుస్థితి అలాగే ఉందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా జనం గెలిచే రాజకీయాలు చేయాలని... అందుకోసం బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
'జనాభా విషయంలో మనం చైనాను కూడా దాటేశాం. దేశంలో ఎలాగైనా ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది. ఎన్నికల రాజకీయతంత్రంలో దేశం చిక్కుకుపోయింది. ప్రతి ఎన్నికల్లోనూ నేతలు కాదు.. జనం గెలవాలి. ఎన్నికల్లో జనం గెలిస్తే సమాజమే మారుతుంది. జనం చంద్రుడు, నక్షత్రాలు కోరట్లేదు.. నీళ్లు ఇవ్వమని కోరుతున్నారు. మహారాష్ట్ర దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం. ఔరంగాబాద్‌లో 8 రోజులకు ఒకసారి తాగునీరు వస్తోందని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ప్రజల స్థితిగతులు మారలేదు. మహారాష్ట్ర సంగతి పక్కకు పెట్టండి. దేశ రాజధానిలోనూ అదే దుస్థితి. గంగా, యమునా డెల్టా ప్రాంతమైన దిల్లీలోనూ ఇదే దుస్థితి ఉంది.' - సీఎం కేసీఆర్