Medical Colleges Inauguration: రాష్ట్రంలో నేడు ఒక్కరోజే ఎనిమిది కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, సంగారెడ్డి వైద్యకళాశాలల్లో విద్యాబోధనకు నేటి నుంచి శ్రీకారం చుట్టనున్నారు. ఎనిమిది కళాశాలల్లోనూ ఏకకాలంలో హైదరాబాద్ ప్రగతిభవన్ నుంచి సీఎం కేసీఆర్ ఆన్లైన్ విధానం ద్వారా ప్రారంభించనున్నారు. దేశ వైద్యరంగంలో తెలంగాణ నూతన విప్లవానికి శ్రీకారం చుడుతోందని... దేశ చరిత్రలో ఇదో అరుదైన సందర్భమని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు ఐదు ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. 1946లో ఉస్మానియా, 1956లో గాంధీ వైద్య కళాశాలలు ఏర్పాటు కాగా... 1959లో వరంగల్లో కాకతీయ వైద్యకళాశాలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2008లో ఆదిలాబాద్ రిమ్స్, 2012లో నిజామాబాద్లో ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటయ్యాయి. కేవలం ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండడంతో 850 సీట్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. వైద్య కళాశాలలు లేక, సూపర్ స్పెషాలిటీ వైద్యం అందక ప్రజలు ఎంతో ఇబ్బంది పడేవారు. ఏదైనా పెద్ద వ్యాధి వస్తే చికిత్స పొందాలన్నా.. మెరుగైన వైద్యం దొరకాలన్నా హైదరాబాద్కు పరిగెత్తాల్సి వచ్చేది.
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందని ద్రాక్షగా ఉండేది. తక్కువ సీట్లు అందుబాటులో ఉండడంతో రాష్ట్ర విద్యార్థులకు మెడిసిన్ విద్య కష్టతరంగా ఉండేది. స్వరాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను పేదలకు చేరువ చేయడంతో పాటు వైద్యవిద్య అందుబాటులో ఉండేలా ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అందుకు అనుగుణంగా రాష్ట్రం ఆవిర్భవించిన తొలి నాళ్లలోనే మహబూబ్ నగర్, సిద్దిపేటలో ప్రభుత్వ వైద్యకళాశాలలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాతి దశలో నల్గొండ, సూర్యాపేటలోనూ ప్రభుత్వ వైద్యకళాశాలలు ఏర్పాటయ్యాయి. కొత్తగా ఏర్పాటైన నాలుగు కళాశాలలతో రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యకళాశాలల సంఖ్య తొమ్మిదికి చేరింది. దీంతో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య కూడా పెరిగింది.