తెలంగాణ

telangana

ETV Bharat / state

కుల, మత రాజకీయాలతో ముప్పే.. దేశరక్షణ కోసం నాతో కలిసి నడవండి: కేసీఆర్

CM KCR Comments: ''కేంద్రంలోని పెద్దలు రాష్ట్రాలకు తగవులు పెట్టి ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. 2004లో కృష్ణా ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేసినా నేటికీ తీర్పు రాలేదు. అది ఎప్పుడు రావాలి? ప్రాజెక్టులు ఎప్పుడు నిర్మించాలి? ప్రజలకు నీళ్లు ఎప్పుడు అందాలి? మొండి పట్టుదలతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకుని నీరు తెచ్చుకున్నాం.'' అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.

CM KCR
CM KCR

By

Published : Jan 13, 2023, 7:06 AM IST

కుల, మత రాజకీయాలతో ముప్పే.. దేశరక్షణ కోసం నాతో కలిసి నడవండి: కేసీఆర్

'‘భవిష్యత్తు రాజకీయాల్లో భారతదేశానికే వెలుగుమార్గం చూపించే అద్భుతమైన చైతన్య వీచిక తెలంగాణ నుంచే వీయాలి. మత, కులపిచ్చితో ప్రజలను విడదీసే విధానాల వల్ల దేశం నరకమవుతుంది. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల పాలన వంటి పరిస్థితులొస్తాయి. విద్వేషపు మంటలు చెలరేగితే జాతి జీవనాడి దహించుకుపోతుంది. అలాంటి స్థితిలో దేశానికి పెట్టుబడులెలా వస్తాయి? పారిశ్రామిక రంగం ఎలా అభివృద్ధి చెందుతుంది?’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనాలకు ఆయన గురువారం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభల్లో ప్రసంగించారు. ఆయన ప్రధానంగా కేంద్రంలోని భాజపా ప్రభుత్వ విధానాలను దుయ్యబడుతూ.. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించే ప్రయత్నం చేశారు.

దేశ రక్షణకు తనతో కలిసి నడుం బిగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మనం ఎంత బాగుపడ్డా.. కేంద్రంలోనూ నిష్పక్షపాత ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి పనులు జరుగుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల జాతర రోజూ పల్లెల్లో కనిపిస్తోంది. సరిపడా కరెంటు, కాల్వల ద్వారా నీరొచ్చి కొన్ని బోర్ల ద్వారా బయటకు ఎగజిమ్ముతోంది. తెలంగాణ వచ్చినప్పుడు మన జీఎస్‌డీపీ రూ.5 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు రూ.11.50 లక్షల కోట్లకు పెంచుకున్నాం. కేంద్రప్రభుత్వ అసమర్థ విధానాల వల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రమే రూ.3 లక్షల కోట్లు నష్టపోయింది. కేంద్రంలో పరిపాలన బాగుంటే తెలంగాణ జీఎస్‌డీపీ రూ.14.50 లక్షల కోట్లుండాలి.. కానీ రూ.11.50 లక్షల కోట్ల వద్దనే ఆగిపోయాం. కేంద్ర ప్రభుత్వ విధానాలే దీనికి కారణం.

ఏటా 50 వేల టీఎంసీల నీరు సముద్రంపాలు

రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలకు కేంద్రం అసమర్థతే కారణం. దేశంలో ఏటా 1.40 లక్షల టీఎంసీల వర్షం కురుస్తుంది.. సగం ఆవిరైపోతే మిగిలిన 70 వేల టీఎంసీల నీరు గోదావరి, కృష్ణా, నర్మద, గంగ తదితర నదుల్లో ప్రవహిస్తుంది. ఇందులో 20 వేల టీఎంసీలు వినియోగిస్తున్నాం. మిగిలిన 50 వేల టీఎంసీలు సముద్రం పాలవుతోంది. పొరుగు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాల్లో సిద్ధంగా ఉన్న 39 వేల మెగావాట్ల హైడ్రో థర్మల్‌ ప్లాంట్లను పార్లమెంటుకు తప్పుడు నివేదికలు ఇచ్చి ఆపేస్తున్నారు. ఈ దుస్థితి ఎందుకు కొనసాగాలి?

కురవి వీరభద్రుడి దయ.. మానుకోట రాళ్ల బలంతోనే..

తెలంగాణ ఉద్యమంలో మహబూబ్‌నగర్‌ ప్రాంతంలో పర్యటించినప్పుడు దారుణ కరవు పరిస్థితులు చూసి కన్నీళ్లు పెట్టుకున్నా. ‘పక్కనే కృష్ణమ్మ ఉన్నా ఫలితమేమీ లేకపాయె.. పాలమూరు, నల్లగొండ, ఖమ్మం మెట్టు జిల్లాలు ఎండిపాయె..’ అనే పాట నేనే రాశాను. సగం గీకి, గోకి వదిలేసిన కాల్వలను చూసి నీళ్లు రావని బాధపడ్డాను. మంచిర్యాల, రామగుండం, ఏటూరునాగారం ప్రాంతాల్లో గోదావరి దాటుతున్నప్పుడు చిల్లర వేసి తల్లీ.. మా కరవు ఎప్పుడు తీరుస్తావని వేడుకునేవాడిని. రాష్ట్రం ఏర్పడితే కురవి వీరభద్రస్వామికి మీసాలు చేయిస్తానని మొక్కుకున్నా. ఆయన దయ, మీరంతా నాడు చేసిన ఉద్యమం, మానుకోట రాళ్ల బలం కారణంగా రాష్ట్రం సాకారమైంది. మహబూబాబాద్‌, ములుగు, భూపాలపల్లి తదితర ఆదివాసీలు, లంబాడీలున్న ప్రాంతాల్లో వెలుగులు రావాలని పట్టుబట్టి జిల్లాలుగా ఏర్పాటుచేశా. 31 జిల్లాల్లో చక్కటి కలెక్టరేట్ల నిర్మాణం జరిగింది. ఇటీవల పంజాబ్‌ స్పీకర్‌ వచ్చి ‘మా దగ్గర మంత్రుల ఛాంబర్‌ కంటే మీ కలెక్టర్‌ ఛాంబర్లే బాగున్నాయి’ అని కితాబిచ్చారు.

స్థానిక సంస్థలకు భారీగా నజరానా

మహబూబాబాద్‌ పురపాలిక ముఖచిత్రం మార్చినందుకు ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌, పురపాలక కమిషనర్‌లను అభినందిస్తున్నా. మరింత అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధుల నుంచి మహబూబాబాద్‌కు రూ.50 కోట్లు, డోర్నకల్‌, మరిపెడ, తొర్రూరు పురపాలక సంఘాలకు తలా రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నాం. జిల్లాలోని ప్రతి పంచాయతీకి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నా. ఏయే పనులు చేయాలో పూర్తి బాధ్యత సర్పంచులకే వదిలిపెట్టి వారి ద్వారానే పనులు చేయించాలి.

ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటుకు అనుమతి

రాష్ట్రం ఏర్పడక ముందు ప్రభుత్వపరంగా మూడు, నాలుగు వైద్య కళాశాలలు మాత్రమే ఉండేవి. ఈరోజు 33 కళాశాలలు ఏర్పాటు చేశాం. మహబూబాబాద్‌లోనూ వైద్య కళాశాల వచ్చింది. ఇక్కడ ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటుకు ఈవేదిక నుంచే అనుమతులిస్తున్నా, వచ్చే విద్యాసంవత్సరం నుంచే తరగతులు ప్రారంభమవుతాయి.

పీవీ గురువు.. నూకల రామచంద్రారెడ్డి

మానుకోట గడ్డపై పుట్టిన నూకల రామచంద్రారెడ్డి గురించి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘ఆయన గొప్ప మేధావి. తెలంగాణకోసం తపించారు. ఎమ్మెల్యేల ఫోరం ఏర్పాటు చేశారు. ఎందరికో పీవీనరసింహారావు గురువైతే.. ఆయనకే గురువు రామచంద్రారెడ్డి. పీవీకి ఇవ్వకపోతే తానూ మంత్రి పదవి తీసుకోనని రామచంద్రారెడ్డి తిరస్కరించారు. ఆయన స్వస్థలం మహబూబాబాద్‌. వరంగల్‌లో ఆయన కాంస్య విగ్రహాలను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. పెద్ద ఇన్‌స్టిట్యూట్‌కు త్వరలోనే రామచంద్రారెడ్డి పేరుపెడతాం’ అని సీఎం ¸వెల్లడించారు.

కేసీఆర్‌ వెంటే తుమ్మల

కొత్తగూడెం పర్యటనలో తుమ్మల నాగేశ్వరరావు ఆద్యంతం సీఎం వెంటే ఉన్నారు. ఆయనను ముఖ్యమంత్రి ఆత్మీయంగా పలకరించారు. కలెక్టరేట్‌ ప్రారంభోత్సవ సందర్భంగా తుమ్మలను కేసీఆర్‌ పిలిచి తన పక్కన నిలబెట్టుకున్నారు. భారాస జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవానికీ బస్సులో తీసుకెళ్లారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా భారాసలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో తుమ్మలకు కేసీఆర్‌ ప్రాధాన్యమివ్వడం విశేషం.

* మహబూబ్‌బాద్‌ పర్యటనలో సీఎం తొలుత భారాస కార్యాలయాన్ని ప్రారంభించారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ మాలోత్‌ కవితను కుర్చీలో కూర్చోబెట్టి ఆశీర్వదించారు. తెరాస.. భారాసగా మారాక రాష్ట్రంలో ప్రారంభించిన తొలి పార్టీ కార్యాలయం ఇదే. అనంతరం రూ.54.02 కోట్లతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించి కలెక్టర్‌ శశాంకను కుర్చీలో కూర్చోబెట్టి అభినందించారు. కొత్తగూడెంలో నూతన సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించారు. అక్కడ సభ అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రేగా కాంతారావును కుర్చీలో కూర్చోబెట్టి అభినందించారు.

* ఈ కార్యక్రమాల్లో మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ, ఎంపీలు కవిత, దయాకర్‌, నామా, వద్దిరాజు రవిచంద్ర, జడ్పీ ఛైర్‌పర్సన్లు ఆంగోతు బిందు, గండ్ర జ్యోతి, విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్‌, రెడ్యానాయక్‌, హరిప్రియ, ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, రేగా కాంతారావు, వనమా, మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియ, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు పాల్గొన్నారు.

కుల, మత, వర్గ, వర్ణ రహిత సంక్షేమమే ధ్యేయం

ప్రజాస్వామ్యంలో ప్రజలు, వారి అభిప్రాయాలే గెలవాలి. వాగ్దానాలు నెరవేర్చకపోతే నిలదీసే ప్రజాస్వామ్య ప్రక్రియ రావాలి. 18న ఖమ్మంలో జరిగే బహిరంగసభను విజయవంతం చేయాలి. తెలంగాణలో కుల, మత, వర్గ, వర్ణ రహితంగా ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుదాం.-సీఎం కేసీఆర్‌

ఇంద్రభవనాల్లా సమీకృత కలెక్టరేట్లు: సీఎస్‌

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన శాంతికుమారి తొలిసారిగా మహబూబాబాద్‌, కొత్తగూడెం జిల్లాల పర్యటనకు సీఎంతో కలిసి వచ్చారు. రెండుచోట్లా సభల్లో ఆమె మాట్లాడుతూ.. ‘నేను కలెక్టర్‌గా పనిచేసే సమయంలో ప్రభుత్వ కార్యాలయాల్లో మరుగుదొడ్లు లేవు. కొత్త కలెక్టరేట్‌లు ఇంద్రభవనాలను తలపిస్తున్నాయి. వీటి నిర్మాణాల్లో నేనూభాగసామినయ్యాను. సమీకృత కలెక్టరేట్‌ల రూపకల్పనకు కర్త, కర్మ ముఖ్యమంత్రే. రాష్ట్రం ఏర్పాటైనప్పుడు మన ఆదాయం రూ.63 వేల కోట్లు. ఇప్పుడు మూడింతలై రూ. 1.80 లక్షల కోట్లకు పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తు, హరితహారం వంటి కార్యక్రమాలతో రాష్ట్రం అద్భుతంగా ముందుకు సాగుతోంది. సీఎం తన అనుభవంతో ‘కంటివెలుగు’కు రూపకల్పన చేశారు’ అని అన్నారు.

రిజర్వేషన్ల పెంపుతో ప్రయోజనాలు

గిరిజనులకు 6 శాతం ఉన్న రిజర్వేషన్‌ను 10 శాతానికి పెంచినందుకు సీఎంకు ధన్యవాదాలు. దీనిద్వారా రాష్ట్రంలోని గిరిజన బిడ్డలకు విద్య, ఉద్యోగాల్లో పలు ప్రయోజనాలు దక్కుతాయి. తండాలను పంచాయతీలుగా చేసి వాటికి గిరిజన బిడ్డలనే సర్పంచులుగా చేశారు. నా ఊపిరి ఉన్నంతవరకు సీఎం సూచనలతో ఈ ప్రాంత ప్రజలకు సేవ చేస్తానని మాట ఇస్తున్నాను. -మంత్రి సత్యవతి రాథోడ్‌

ఎండాకాలంలోనూ మత్తళ్లు

సీఎం కేసీఆర్‌ మానుకోటకు రావడం కన్న తల్లితండ్రులే వచ్చినట్లుగా ఉంది. మా కుటుంబసభ్యులు సేద్యం చేసినప్పుడు నీళ్లు లేవు. తండాల్లో తాగునీటికీ కరవే. సీఎం తీసుకున్న చర్యలతో ఇప్పుడు ఎండాకాలంలోనూ చెరువులు మత్తళ్లు పోస్తున్నాయి. రూ.510 కోట్లు ఇచ్చి వైద్యకళాశాలను నిర్మిస్తూ వైద్యం అందించేలా సదుపాయాలు కల్పించారు. -ఎర్రబెల్లి దయాకర్‌రావు

వరప్రదాయిని సీతారామ ప్రాజెక్టు

కేసీఆర్‌ పాలనలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు యావత్‌ దేశాన్ని ఆకర్షిస్తున్నాయి. గోసపడ్డ రాష్ట్రాన్ని తెలంగాణ ఉద్యమ రథసారథి, కేసీఆర్‌ అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఉమ్మడి ఖమ్మంజిల్లా వరప్రదాయినిగా నిలిచే సీతారామ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. -పువ్వాడ అజయ్‌

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details