TRSLP Meeting: కేంద్రంపై మరో పోరాటానికి తెరాస సిద్ధమైంది. యాసంగి వడ్లు కొంటారా... కొనరా చెప్పాలంటూ గతంలో ఆందోళనలు చేసిన తెరాస... కచ్చితంగా కొనాల్సిదేనంటూ ఇప్పుడు ఉద్యమానికి వ్యూహరచన చేస్తోంది. తెలంగాణ భవన్‌లో తెరాస అధ్యక్షడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెరాస శాసనసభ పక్షం ఇవాళ భేటీ కానుంది. ఉదయం పదకొండున్నర గంటలకు జరగనున్న ఈ కీలక సమావేశానికి... తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంస్‌ల అధ్యక్షులు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు, కార్పొరేషన్ల ఛైర్మన్లు హాజరు కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో... ధర్నాలు, ఆందోళన, నిరసన కార్యక్రమాలకు సమావేశంలో కార్యాచరణ ఖరారు చేయనున్నారు.
అనంతరం దిల్లీకి...
తెరాస శాసనసభాపక్ష సమావేశం అనంతరం సీఎం కేసీఆర్, మంత్రుల బృందంతో కలిసి దిల్లీ వెళ్లనున్నారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలిసి డిమాండ్ చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. గత నవంబరులోను ధాన్యం కొనుగోలు కోసం దిల్లీకి వెళ్లిన కేసీఆర్... ప్రధాని, కేంద్ర మంత్రులను కలవలేకపోయారు. ఈసారి ముందుగానే అపాయింట్‌మెంట్ తీసుకోవాలని నిర్ణయించారు. సీఎంఓ ఇప్పటికే అపాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారం. ప్రధాని సహా కేంద్రమంత్రులతో భేటీకోసం 3, 4 రోజులు కేసీఆర్... దిల్లీలోనే ఉండనున్నట్లు సమాచారం. సమస్య పరిష్కారమయ్యాకే హైదరాబాద్ రావాలని భావిస్తున్నారు.