పోడుభూముల సమస్య పరిష్కారం, అటవీ రక్షణ- పునరుజ్జీవం, హరితహారం అంశాలపై ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. సంబంధిత శాఖల మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, అటవీ, గిరిజన సంక్షేమం, పోలీస్, పంచాయతీ రాజ్ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తూనే, అటవీ భూములను రక్షిస్తూ వాటిని దట్టమైన అడవులుగా పునరుజ్జీవింపజేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అడవిపై ఆధారపడి బతికే అమాయకులైన గిరిజనులకు మేలు చేయడం, అడవులను నాశనం చేసే శక్తులను గుర్తించి వాళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఆశించిన విధంగా పని చేస్తున్న కలెక్టర్లు అటవీ భూముల రక్షణలోనూ కీలక భూమిక పోషించాలని కేసీఆర్ తెలిపారు. అడవుల రక్షణలో అన్ని స్థాయిల్లోని సంబంధిత శాఖల అధికారులతో పాటు, గ్రామ సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని సూచించారు.
నెల రోజుల పాటు దరఖాస్తులు..
పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులు, ఇతరుల నుంచి నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు దరఖాస్తులు స్వీకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆలోగా వివిధ స్థాయిల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయాలని, ఆర్వోఎఫ్ఆర్ చట్టం ప్రకారం గ్రామ కమిటీలు నియమించాలని తెలిపారు. రెండు, మూడు గ్రామాలకొక నోడల్ అధికారిని నియమించాలని... సబ్ డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, జిల్లా స్థాయిలో కలెక్టర్ ప్రక్రియను పర్యవేక్షించాలని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం, కుమురంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, ములుగు, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, నిర్మల్, వరంగల్, నల్గొండ, నిజామాబాద్ వంటి 12 జిల్లాల్లోనే 87 శాతం పోడు భూముల ఆక్రమణ ఉందని సీఎం కేసీఆర్ అన్నారు.
అడవుల రక్షణను బాధ్యతగా ప్రోత్సహించాలి..
పోడు భూముల సమస్య పరిష్కారం, అటవీ భూముల రక్షణ అంశాలపై అన్ని జిల్లాల్లో అఖిలపక్ష సమావేశాలను నిర్వహించాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటి వరకు పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులు, తదితరులకు ఆర్వోఎఫ్ఆర్ హక్కులు కల్పించడం, ఆ తర్వాత అటవీ భూమి ఇంచు కూడా ఆక్రమణకు గురికారాదన్న విషయంలో అఖిలపక్ష నేతల నుంచి ఏకాభిప్రాయం తీసుకోవాలని చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ ఛైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు తదితర ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని అన్నారు. గ్రామాల్లో సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు అడవుల రక్షణను ఒక బాధ్యతగా తీసుకునేలా ప్రోత్సహించాలని సీఎం సూచించారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పటికీ ప్రజలు బతకలేని పరిస్థితి ఉంటే లాభం లేదని ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి... అడవులను రక్షించుకుంటేనే భవిష్యత్తు తరాలకు మేలు చేసిన వారం అవుతామని పేర్కొన్నారు.
అడవులను నాశనం చేసేవారిపై కఠిన చర్యలు..