జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా ఉద్ధృతి రోజురోజుకూ... పెరుగుతున్న వేళ వైరస్ కట్టడికి అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు, నాలుగు రోజుల్లో ఖరారు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొద్ది రోజుల పాటు లాక్‌డౌన్ విధించాలనే ప్రతిపాదనలపైనా... తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. పాజిటివ్ కేసులు పెరిగినంత మాత్రాన ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్న సీఎం... అందరికీ వైద్యం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
కరోనా వ్యాప్తి నివారణ, వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, భవిష్యత్‌లో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై... సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, ప్రశాంత్‌రెడ్డి, వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి, నివారణ చర్యలపై సీఎం సమీక్షించారు. వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్... రాష్ట్రంలో కరోనా వ్యాప్తి విషయాన్ని వివరించారు.
పరిస్థితిని వివరించిన ఈటల..
దేశంలో మాదిరిగానే తెలంగాణలోనూ కేసులు పెరుగుతున్నాయని, ఎవరూ భయపడాల్సిన అసరంలేదని.. చికిత్స కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి వివరించారు. జాతీయ సగటుతో పోలిస్తే మరణాల సంఖ్య కూడా తక్కువేనని... ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు ప్రైవేటు మెడికల్ కాలేజీలలో కూడా వేలాది బెడ్లు సిద్ధం చేసినట్లు ఈటల పేర్కొన్నారు. తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ... లక్షణాలు లేనివారిని హోం క్వారంటైన్‌లో ఉంచుతున్నట్లు ఈటల పేర్కొన్నారు. కొవిడ్ వల్ల మరణించిన వారి జాతీయ సగటు 3.04 ఉండగా, తెలంగాణలో అది కేవలం 1.52 మాత్రమే అని వెల్లడించారు.