తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR: 'మెట్రోను మరింత విస్తరించే దిశగా చర్యలు చేపడతాం'

కరోనా నేపథ్యంలో ప్రయాణాలు తగ్గడం వల్ల ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయిన హైదరాబాద్ మెట్రోను ఆదుకునేందుకు ఉన్న అవకాశాలను అన్వేషిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆర్థికంగా నష్టపోతున్న తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఎల్​ అండ్​ టీ కంపెనీ ఉన్నతాధికారులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో కరోనా కష్టాలను అధిగమించి మెట్రో తిరిగి గాడిలో పడేలా ప్రభుత్వం సహకరిస్తుందని సీఎం భరోసా ఇచ్చారు. మెట్రోను ఆదుకుంటూనే సంస్థకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

CM KCR: 'మెట్రో తిరిగి గాడిలో పడేలా ప్రభుత్వ సహకారం'
CM KCR: 'మెట్రో తిరిగి గాడిలో పడేలా ప్రభుత్వ సహకారం'

By

Published : Sep 15, 2021, 4:54 AM IST

కరోనాతో ప్రయాణికుల సంఖ్య తగ్గి ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయిన హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థను ఆదుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు. మెట్రో అప్పుల్లో కూరుకుపోవడం, వడ్డీలకు వడ్డీలు కట్టాల్సి రావడం శోచనీయమన్నారు. ‘‘దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ నగరానికి మెట్రో సేవలు ఎంతో అవసరం. అది పుంజుకుని.. ప్రజావసరాల దృష్ట్యా మరింత విస్తరించే దిశగా చర్యలు చేపడతాం’’ అని సీఎం తెలిపారు. అన్ని రంగాలను ఆదుకున్నట్లే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక మెట్రోను కూడా గాడిలో పెట్టడానికి కృషి చేస్తుందన్నారు. మెట్రో పూర్వవైభవం కోసం చేపట్టాల్సిన చర్యలపై పురపాలక, రోడ్లు భవనాల మంత్రులు కేటీ రామారావు, వేముల ప్రశాంత్‌ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, అర్వింద్‌కుమార్‌, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, జయేశ్‌రంజన్‌లతో అత్యున్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

ఈ కమిటీ అన్ని రకాలుగా అధ్యయనం చేసి అతి త్వరలో నివేదిక అందించాలని ఆదేశించారు. మెట్రోపై మంగళవారం ఆయన ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. కరోనా కాలంలో మెట్రో ఎదుర్కొంటున్న ఆర్థిక నష్టాలను, బ్యాంకు అప్పులు, రోజురోజుకు పేరుకుపోతున్న వడ్డీల గురించి ఎల్‌అండ్‌టీ సీఈవో, ఎండీ సుబ్రహ్మణ్యం, సంస్థ డైరక్టర్‌ డీకే సేన్‌, ప్రాజెక్టుల సీఈవో అజిత్‌, హైదరాబాద్‌ మెట్రో సీఈవో కేవీబీ రెడ్డి తదితరులు వివరించారు. ‘‘అనతి కాలంలోనే సురక్షిత ప్రజారవాణా వ్యవస్థగా హైదరాబాద్‌ మెట్రో సేవలందిస్తూ ప్రజాదరణ పొందింది. కరోనా అన్ని రంగాలను ప్రభావితం చేసినట్లే మెట్రోను కూడా ఇబ్బందుల్లోకి నెట్టింది. ప్రజావసరాల దృష్ట్యా క్లిష్ట సందర్భాల్లో వినూత్నంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎలాంటి విధానాలు అవలంబించడం ద్వారా మెట్రోకు మేలు చేయగలుగుతామో అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం’’ అని సీఎం తెలిపారు. మంత్రులు మహమూద్‌అలీ, ప్రశాంత్‌రెడ్డి, మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు.

ఇదీ చూడండి:Dalitha bandhu: హుజూరాబాద్​లో 14,400 మంది ఖాతాల్లో దళిత బంధు నిధులు

ABOUT THE AUTHOR

...view details