ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా తిరిగి వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు నిబంధనలను కచ్చితంగా పాటించి వైరస్‌ను అరికట్టేందుకు కృషి చేయాలన్నారు. ‘‘ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యవంతమైన సమాజంతోనే అభివృద్ధి సాధ్యమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. దీనికి దోహదపడే పలు పథకాలను విజయవంతంగా అమలు చేస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, వైద్య వ్యవస్థను బలోపేతం చేసింది. హైదరాబాద్ మహానగర పరిధిలో బస్తీ దవాఖానాలు నిర్వహిస్తూ సత్ఫలితాలను సాధించింది. మిగతా పట్టణాల్లో కూడా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసే చర్యలు చేపట్టింది. గత ఏడాది కాలంగా కరోనా కష్టకాలాన్ని తెలంగాణ తట్టుకుని నిలబడడానికి ప్రజల ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లే కారణం. రోగ నిరోధక శక్తి స్థాయి పెరగడానికి ఇవి దోహద పడ్డాయి.