సిబ్బంది మరింత ప్రశాంతంగా విధులను నిర్వహించుకునేలా సచివాలయ నిర్మాణం ఉండబోతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. సచివాలయం ముఖద్వారం బయటి గేటు నిర్మాణాలు, వాటికి అమర్చాల్సిన గ్రిల్స్ తదితర అంశాలను ఆయన స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రహరీ గోడలకు అమర్చాల్సిన లాంప్‌పోస్టులపై సూచనలిచ్చారు. విశాలంగా నిర్మిస్తున్న కారిడార్ ప్రాంతాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు.
Cm Secretariat Visit: తెలంగాణ గౌరవం ఉట్టిపడేలా నిర్మాణం ఉండాలి: సీఎం కేసీఆర్
పాలనారీతులకు అద్దంపట్టేలా.. తెలంగాణ గౌరవం ఉట్టిపడేలా సచివాలయ నిర్మాణ కౌశలం ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాక్షించారు. సెక్రటేరియట్ నిర్మాణ పురోగతిని పరిశీలించిన సీఎం త్వరితగతిన పనులు పూర్తిచేయాలని ఏజెన్సీ ప్రతినిధులు, అధికారులను ఆదేశించారు. ప్రాంగణం మొత్తం కలియ తిరిగిన ఆయన నిర్మాణ పనులకు సంబంధించి ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించారు.
ముఖ్యమంత్రి, మంత్రుల కార్యాలయాలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఇతర సిబ్బంది, సాధారణ పరిపాలన అధికారుల కార్యాలయాల నిర్మాణవివరాలను సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. సచివాలయం ముందు, చుట్టుపక్కలనుంచి వర్షపు నీరువెళ్లేందుకు అనువుగా వరదనీటి డ్రైనేజీ వ్యవస్థ నిర్మించాలని సీఎం ఆదేశించారు. విశాలమైన పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా, ఎక్కడికక్కడ నీరు తరలిపోయేలా ఉండాలన్న కేసీఆర్ .. కాంక్రీట్ నిర్మాణపనులు పూర్తయ్యేలోపే ముందస్తు వ్యూహంతో అవసరమైన సామాగ్రి అందుబాటులో ఉంచుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఫర్నీచర్, విద్యుత్ సహా సచివాలయ నిర్మాణంలో వినియోగించే అన్నివిభాగాలకు చెందిన ఇంటీరియర్ మెటీరియల్ ముందే సమకూర్చుకోవడం ద్వారా పనుల్లో జాప్యం జరగకుండా ఉంటుందని వివరించారు.
సచివాలయం చుట్టూ కాలినడకన తిరిగిన ముఖ్యమంత్రి నిర్మాణ నాణ్యతను పరిశీలించారు. ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా, విదేశాల నుంచి వచ్చేప్రతినిధులు ప్రముఖుల కోసం నిర్మిస్తున్న వెయిటింగ్ హాల్ నిర్మాణాల తీరు సందర్శకులు కూర్చునే ప్రదేశాలను పరిశీలించారు. కార్లు, ద్విచక్రవాహనాలు, బస్సులు నిలిపి ఉంచే స్థలాలు పరిశీలించారు. హెలీపాడ్ నిర్మాణంపై అడిగితెలుసుకున్నారు. దివ్యాంగులు, వయోవృద్ధులు, సందర్శకులు, సచివాలయానికి వచ్చే ప్రముఖల కోసం తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలను సీఎం కేసీఆర్ వివరించారు. అవసరమైన వారికోసం బ్యాటరీతో నడిచే వాహనాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సచివాలయ నిర్మాణంలో కీలకమైన గ్రౌండ్‌ఫ్లోర్ నిర్మాణపనులు పూర్తైనందున ప్రత్యేక చర్యలు చేపట్టి పైఅంతస్తుల పనులను వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. అందుకోసం ఎటువంటి చర్యలు చేపట్టాలో చర్చించి ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించాలని సీఎం కేసీఆర్ సూచించారు.
ఇదీ చూడండి: