CM KCR Review on Palamuru Irrigation Project: కొత్త సచివాలయంలో మొట్టమొదటి సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్.. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల మంత్రులు, ప్రజాప్రతినిధులు, నీటి పారుదల, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో సమావేశం అయ్యారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనుల పురోగతిపై ఆరా తీశారు. తాగునీటి అవసరాల కోసం పనులు కొనసాగించేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన నేపథ్యంలో.. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించిన పనుల పురోగతిపై సీఎం కూలంకషంగా చర్చించారు.
సమీక్షలో భాగంగా జులై వరకు కరివెన జలాశయానికి నీళ్లు తరలించాలన్న కేసీఆర్.. ఆగస్టు వరకు ఉద్ధండాపూర్ రిజర్వాయర్ నీటిని ఎత్తిపోయాలని అధికారులను ఆదేశించారు. అందుకోసం నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్ధండాపూర్ జలాశయాలకు సంబంధించి మిగిలిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పంప్ హౌజ్‌లు, విద్యుత్ సబ్ స్టేషన్లు, ‘కన్వేయర్ సిస్టమ్‌లో మిగిలిన పనులను కూడా పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. పాలమూరు ప్రాజెక్టులైన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పనులకు సంబంధించిన పురోగతిపై కూడా సమీక్షించిన ముఖ్యమంత్రి.. అందులో మిగిలిన కొద్దిపాటి పనులను ఈ జూన్‌లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఉన్నతాధికారులతో కలిసి అక్కడే భోజనం: ఆ తరువాత సచివాలయంలో ఆరో అంతస్తులోని సీఎంవో అధికారులు, సిబ్బంది కార్యాలయాల్లో ఫర్నీచర్, ఏర్పాట్లపై కేసీఆర్ ఆరా తీశారు. ప్రారంభోత్సవం మరుసటి రోజు సచివాలయానికి వచ్చిన సీఎం కేసీఆర్.. మొదట యాగశాలకు చేరుకొని వేదపండితులు నిర్వహించిన ద్వితీయం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం నేరుగా ఆరో అంతస్తులోని తన ఛాంబర్‌కు చేరుకొన్నారు.