KCR FIRES ON MODI OVER GST: కేంద్ర ప్రభుత్వ విధానాలు, తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. రాష్ట్రాలు బలహీనంగా ఉంటే.. కేంద్రం బలహీనం అవుతుందని సూచించారు. పాలు, పెరుగు మీద పన్ను.. చివరికి శ్మశానంలో కూడా పన్ను వేస్తున్నారని ఫైర్ అయ్యారు. గుజరాత్‌లో చేసే గార్భా అనే సంప్రదాయ నృత్యం మీద కూడా పన్ను వేశారని... అసలు నృత్యంపై పన్నేంటి అని కేసీఆర్ ప్రశ్నించారు.
గాలి మీద తప్ప.. అన్నింటిపై పన్ను:దయచేసి పాల మీద జీఎస్టీ ఎత్తివేయండి... అంటూ ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం విజ్ఞప్తి చేశారు. 28 శాతం జీఎస్టీ వల్ల బీడీ కార్మికులు ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు. చేనేతపై కూడా జీఎస్టీ ఎత్తివేయాలని ప్రధానిని కోరుతున్నట్లు తెలిపారు. గాలి మీద తప్ప.. అన్నింటిపై పన్ను వేస్తున్నారని ఆవేదన చెందారు. దేశ ఆర్థిక ప్రగతిని కేంద్రప్రభుత్వం నాశనం చేస్తోందని ఆరోపించారు. ఎఫ్‌ఆర్‌బీఎం మీద పరిమితి విధించి నిధుల లభ్యత తగ్గించారని వ్యాఖ్యానించారు. అల్పాదాయ వర్గాల వస్తువులపై జీఎస్టీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.