Cm Kcr on Budget: బడ్జెట్ అంతా గోల్‌మాల్ గోవిందం: సీఎం కేసీఆర్ Cm Kcr on Budget: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా దారుణంగా ఉందని సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్... మహాభారతంలోని శ్లోకాలు ప్రస్తావించారన్న సీఎం... ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా పాలించాలో శ్లోకం చెబుతుందని తెలిపారు. న్యాయ మార్గంలో పరిపాలన సాగాలని శ్లోకాల్లో ఉందని చెప్పారు. ఆర్థికమంత్రి చెప్పింది శాంతి మార్గం.. చేసింది అధర్మమని ఆరోపించారు. బడ్జెట్‌లో అందరికీ గుండు సున్నా... బడ్జెట్ అంతా గోల్‌మాల్ గోవిందం అని దుయ్యబట్టారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఆత్మవంచన చేసుకుని... దేశ ప్రజలను వంచించారన్నారు.
'సబ్బండ వర్గాలకు రిక్తహస్తం'
సబ్బండ వర్గాలకు కేంద్రం రిక్తహస్తం చూపిందని కేసీఆర్ ఆరోపించారు. వ్యవసాయ రంగానికి ఉద్దీపన లేకపోగా, ఉపాధి అవకాశాలు, ఆరోగ్య రంగానికి ప్రాధాన్యం ఇవ్వలేదని ఆక్షేపించారు. అన్నింటా కోత విధించడం ద్వారా పేదలు, సామాన్యులపై ఉన్న చిత్తశుద్ధిని చాటుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద బీమా సంస్థగా ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారని కేంద్రాన్ని ప్రశ్నించారు.
'ఆ హామీలు ఏమయ్యాయి..'
తెలంగాణలోనే మిషన్ భగీరథకు 40 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తే... 60వేల కోట్లతో జల్జీవన్ మిషన్ అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. 2022 కల్లా చేస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించిన సీఎం.. అనుమతించని క్రిప్టో కరెన్సీపై పన్ను వేయడం ఏమేరకు సబబని విమర్శనాస్త్రాలు సంధించారు.
'కేంద్రానికి చెప్పడం దండగే'
బడ్జెట్‌లో తెలంగాణకు ఇచ్చిందేమీ లేదన్న ముఖ్యమంత్రి... ఈ విషయంలో కేంద్రానికి చెప్పడం దండగేనని ఘాటుగా వ్యాఖ్యానించారు. గడచిన ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రానికి 42 వేల కోట్లు వచ్చాయన్న కేసీఆర్.. ఇది ఒక్క రైతుబంధుతో సమానం కాదని వ్యాఖ్యానించారు. మిగులు జలాల సాకుతో నదుల అనుసంధానం అంటోన్న కేంద్రం... తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
వ్యవసాయానికి ఇచ్చింది శూన్యం
ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్‌లో రూ.12,800 కోట్లే కేటాయించారని సీఎం అన్నారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలోనే రూ.33,600 కోట్లు కేటాయించినట్లు చెప్పుకొచ్చారు. ఎస్సీల జనాభాపై కేంద్రం అబద్దాలు చెబుతోందని మండిపడ్డారు. రైతు ఉద్యమంలో 700 మంది చనిపోయినా బడ్జెట్‌లో కేటాయింపులు శూన్యమని ఆరోపించారు. బడ్జెట్‌లో సాగు రంగానికి ఉద్దీపనలు లేవని సీఎం అన్నారు. రైతులకు ఏమీ చేయకపోగా యూరియాపై రాయితీ తగ్గించారన్న కేసీఆర్... ఎరువులపై రూ.35 వేల కోట్లు రాయితీ తగ్గించారని మండిపడ్డారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలోనూ రూ.25 వేల కోట్ల కోత విధించారని తెలిపారు.
కేంద్ర బడ్జెట్ చాలా దారుణంగా ఉంది. బడ్జెట్ సందర్భంగా మహాభారతంలోని శ్లోకాలు ప్రస్తావించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా పాలించాలో శ్లోకం చెబుతుంది. న్యాయ మార్గంలో పరిపాలన సాగాలని శ్లోకాల్లో ఉంది. ఆర్థికమంత్రి చెప్పింది శాంతి మార్గం.. చేసింది అధర్మం. బడ్జెట్‌లో అందరికీ గుండు సున్నా. బడ్జెట్ అంతా గోల్‌మాల్ గోవిందం. నిర్మలాసీతారామన్ ఆత్మవంచన చేసుకున్నారు. నిర్మలా సీతారామన్ దేశ ప్రజలను వంచించారు.
-- కేసీఆర్, ముఖ్యమంత్రి
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: