Kcr Fire on Central Govt: కేంద్ర ప్రభుత్వానికి మెదడు లేదని సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్ర విద్యుత్ విధానం చెత్తగా ఉందని ముఖ్యమంత్రి విమర్శించారు. కేంద్రం దేశాన్ని నాశనం చేస్తోందన్నారు. గతంలో కాంగ్రెస్, ఇప్పుడు భాజపా దేశాన్ని నాశనం చేస్తున్నాయని మండిపడ్డారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంతో మోదీ అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. గుజరాత్ మోడల్.. లోన లొటారం.. పైన పటారమని దుయ్యబట్టారు. కేంద్ర బడ్జెట్ దిక్కుమాలినతనంగా దరిద్రంగా ఉందన్నారు.
పవిత్ర గంగా నదిలో శవాలు తేలేలా కేంద్రం చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. విద్యుత్ సంస్కరణల పేరుతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్న ఆయన... కరోనా సమయంలో ఆరోగ్యరంగానికి బడ్జెట్ పెంచలేదని పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు కల్పించలేదన్న సీఎం... రూ.లక్షల కోట్లు ముంచిన వాళ్లకు రాయితీలు ఇస్తారన్నారు. భాజపా పాలన అంటే.. నమ్మి ఓట్లేసిన వాళ్లను ముంచుడేనన్నారు.
'ప్రపంచ ఆకలి బాధపై ఏటా హంగర్ ఇండెక్స్ వెలువడుతుంది. హంగర్ ఇండెక్స్‌లో భారత్ 101 స్థానంలో నిలిచింది. నేపాల్, బంగ్లాదేశ్ కంటే అద్వాన స్థితిలో భారత్ ఉంది. బడ్జెట్‌లో ఆహార రాయితీలు కూడా తగ్గించారు. బడ్జెట్‌లో పంటల మద్దతు ధరల ప్రస్తావన లేదు. కేంద్ర బడ్జెట్‌తో ఎవరిని ఉద్దరించారు. ఎల్‌ఐసీని అమ్ముతామని నిస్సిగ్గుగా చెబుతున్నారు. లాభాల్లో ఉన్న ఎల్‌ఐసీని ఎందుకు అమ్ముతున్నారు. అమెరికా కంపెనీలకు బ్రోకర్లుగా వ్యవహరిస్తారా?'
-- కేసీఆర్, సీఎం
'రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాల భర్తీ..'
రాష్ట్రంలో ఇప్పటికే లక్షా 35 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్న కేసీఆర్.. మరో 40 నుంచి 50 వేలు త్వరలోనే భర్తీ చేస్తామని ప్రకటించారు. సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కేలా చర్యలు చేపట్టామని వివరించారు. కొందరు స్వార్థపరులైన ఉద్యోగులకు వత్తాసు పలుకుతారా అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. 317 జీవో విషయంలో అనవసర రాద్ధాంతం చేసే వారిని నిలదీయాలని కేసీఆర్ యువతకు పిలుపునిచ్చారు.
'తెలంగాణ నమూనా కావాలంటున్నారు...'