దిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రగతి భవన్లో ఆర్టీసీ సమ్మెపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో సహా పలువురు సీనియర్ అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులతో జరిగిన చర్చల వివరాలను సీనియర్ ఐఎఎస్ అధికారుల కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. కార్మికుల డిమాండ్లను పరిశీలించి, పరిష్కరించడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందనే విషయాన్ని తెలిపినప్పటికీ.. కార్మిక సంఘాల నాయకులు సమ్మె కొనసాగించడానికే నిర్ణయించుకున్నట్లు అధికారులు వివరించారు.
సమ్మె.. చట్ట విరుద్ధం
ఆర్టీసీ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో సంస్థకు నష్టం కలిగించే విధంగా యూనియన్లు సమ్మెకు పిలుపునివ్వడం పట్ల ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. సమ్మెను నిషేధిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసినా.. ఉల్లంఘించడం చట్ట విరుద్ధమని అధికారులు అభిప్రాయపడ్డారు. చట్ట వ్యతిరేకంగా సమ్మె చేస్తే కార్మికులను ఉద్యోగాల్లోంచి తొలగించే అధికారం సంస్థకు ఉందని చెప్పారు. సమ్మె విషయంలో అధికారులు చట్ట ప్రకారమే నడుచుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
ఇక చర్చలు ఉండవు..
శనివారం సాయంత్రం 6 గంటల లోగా విధుల్లో చేరిన వారిని మాత్రమే ఆర్టీసీ ఉద్యోగులుగా గుర్తించాలని.. మిగతా వారిని తమంతట తాము ఉద్యోగాలు వదులుకున్న వారిగానే పరిగణించాలని సీఎం ఆదేశించారు. ఆర్టీసీ యూనియన్ నాయకుల ఉచ్చులో పడి.. కార్మికులు సంస్థకు నష్టం చేయవద్దని, ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని సీఎం సూచించారు. కార్మికుల డిమాండ్లపై ఇకపై ఎలాంటి చర్చలు ఉండవని స్పష్టం చేశారు. ఆర్టీసీని కాపాడడానికి ప్రభుత్వం ఎంతో చేసిందని.. కానీ కార్మికులే ఆర్టీసీని ముంచే పని చేస్తున్నారని.. ఈ పరిస్థితుల్లో సంస్థను కాపాడడం కష్టమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.