CM KCR: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో పురుషుడితో పాటుగా అన్ని రంగాల్లో మహిళలు సమాన పాత్ర పోషిస్తున్నారని సీఎం అన్నారు. కుటుంబ అభివృద్ధిలో గృహిణిగా స్త్రీ పాత్ర ఎంతో గొప్పదని త్యాగపూరితమైందని సీఎం అన్నారు. అన్నీతానై కుటుంబాన్ని చక్కబెట్టుకుంటూ అందరి ఆలనా పాలనా చూసే ఒక తల్లి కనబరిచే ప్రాపంచిక దృక్పథాన్ని, దార్శనికతను, మానవీయ కోణాన్ని.. తమ పాలన లో అన్వయించుకుని తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం స్పష్టం చేశారు.
మానవ జాతికి మహిళ ఒక వరం అని తెలిపిన సీఎం.. మహిళాభ్యుదయానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్దితో శక్తివంచన లేకుండా కృషి చేస్తోందన్నారు. దళిత, బడుగు బలహీన వెనకబడిన వర్గాలు, రైతుల ఆత్మబంధువుగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని సీఎం అన్నారు. మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పలు పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మహిళాబంధుగా ఆదరణ పొందుతుండడం తనకెంతో సంతోషం కలిగిస్తోందని సీఎం కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఏర్పాటైన నాటినుంచి నేటివరకు 10 లక్షల మంది ఆడపిల్లల పెళ్లికి కల్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ ద్వారా తనవంతుగా ఆర్థికంగా ఆదుకుంటూ.. 10 లక్షల మంది తల్లులకు కేసీఆర్ కిట్స్ అందించి ప్రభుత్వం ఆర్థికంగా ఆలంబననిస్తోందన్నారు. ఆరోగ్య లక్ష్మి, అమ్మ ఒడి వంటి పథకాలతో పాటు, వితంతువులు, వృద్ధ మహిళలు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు నెలా నెలా సకాలంలో పింఛన్లు అందజేస్తూ, షీ టీమ్స్ ద్వారా రక్షణ కల్పిస్తూ.. అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లకు జీతాల పెంచడంతో పాటు ఇంకా అనేక పథకాలను అమలు చేస్తున్నామన్నారు.