CM KCR Distributed Cheques: రైతులు తలుచుకుంటే ప్రభుత్వాలే మారుతాయని సీఎం కేసీఆర్ అన్నారు. రైతులు పండించిన పంటలకు మంచి మద్దతు ధర రావాలని ఆకాంక్షించిన సీఎం... అందుకు రాజ్యాంగపరమైన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయంపై ఇప్పటికీ ఆంక్షలు విధిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. సాగుకు ఉచితంగా విద్యుత్ ఇస్తుంటే మీటర్లు పెట్టాలని అంటోందని సీఎం తెలిపారు. ఉత్తరాది పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ చండీగఢ్‌లో పర్యటించారు. రైతులు, జవాన్ల కుటుంబాలను సీఎం కేసీఆర్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పరామర్శించారు. చంఢీగఢ్‌లోని ఠాగూర్ స్టేడియంలో రైతుల కుటుంబాలను ఇరువురు ముఖ్యమంత్రులు పరామర్శించారు. రైతు ఉద్యమంలో అమరులైన అన్నదాతలకు నివాళులర్పించారు. అనంతరం ఠాగూర్ స్టేడియంలో రైతుల కుటుంబాలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. ప్రసంగం తర్వాత గాల్వన్‌లోయ ఘర్షణలో అమరులైన జవాన్ల కుటుంబాలకు, అమరులైన రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేశారు. దిల్లీ, పంజాబ్ సీఎంల సమక్షంలో 600 కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ చేశారు.
రైతులు తలుచుకుంటే ప్రభుత్వాలే మారుతాయి. రైతులు పండించిన పంటలకు మంచి ధర రావాలి. ఇందుకు రాజ్యాంగపరమైన హక్కులు కల్పించాలి. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అలా చెబితే.. వారికే మనం మద్దతివ్వాలి. ఇదే స్ఫూర్తి దేశవ్యాప్తంగా మన రైతు నాయకులు తీసుకొస్తే.. ఇది సాధ్యం అవుతుంది. మీరు చేసే ఆందోళనకు మా మద్దతు ఉంటుంది. మన డిమాండ్లు కేంద్రం అంగీకరించేవరకు మన పోరాటం కొనసాగాలి. అప్పటివరకు రైతు నాయకులకు మా మద్దతు ఉంటుంది.-- సీఎం కేసీఆర్
మీ పోరాటానికి సలాం:కేంద్రం సాగుచట్టాలు రద్దు చేసేంతవరకు రైతులు పోరాడారని సీఎం కేసీఆర్ అన్నారు. ఇది చాలా బాధాకరమైన సందర్భమన్న ఆయన... రైతుల సమస్యలకు పరిష్కారం ఇంకా దొరకట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు పోరాట స్ఫూర్తికి సలాం చేస్తున్నానని తెలిపారు. దేశ చరిత్రలో పంజాబ్ రైతులు రెండు గొప్ప పోరాటాలు చేశారని కొనియాడారు. భగత్‌సింగ్ వంటి వీరులు ప్రాణాలు అర్పించి స్వాతంత్య్రం సాధించారని పేర్కొన్నారు. పంజాబ్ యువకులు సైన్యంలో చేరి దేశాన్ని కాపాడుతున్నారన్న సీఎం... హరితవిప్లవంతో పంజాబ్ రైతులు దేశం ఆకలిని తీర్చారని స్పష్టం చేశారు. సాగుచట్టాలు రద్దు చేయించి వ్యవసాయాన్ని కాపాడారని సీఎం అభినందించారు. రైతుల పోరాటానికి తాము సంపూర్ణ మద్దతు ఇచ్చినట్లు గుర్తుచేశారు. భాజపాను ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు.
ఇది చాలా బాధాకరమైన సందర్భం. రైతుల సమస్యలకు పరిష్కారం ఇంకా దొరకట్లేదు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా దేశం పరిస్థితి మారలేదు. కేంద్రం సాగుచట్టాలు రద్దు చేసేంతవరకు రైతులు పోరాడారు. పంజాబ్ రైతుల పోరాట స్ఫూర్తికి సలాం చేస్తున్నా. సాగుచట్టాలు రద్దు చేయించి వ్యవసాయాన్ని కాపాడారు. రైతుల పోరాటానికి మేం సంపూర్ణ మద్దతు ఇచ్చాం. కేంద్ర సర్కార్ వ్యవసాయంపై ఇప్పటికీ ఆంక్షలు విధిస్తోంది. సాగుకు ఉచితంగా విద్యుత్ ఇస్తుంటే మీటర్లు పెట్టాలని అంటోంది. భాజపాను ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర వేస్తున్నారు. -- సీఎం కేసీఆర్