నేడు ప్రధానితో కేసీఆర్ భేటీ... కీలక అంశాలపై చర్చ... తొమ్మిది నెలల విరామం తర్వాత దిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్... ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీతో సమావేశమవనున్నారు. రెండోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టినందుకు గానూ మోదీని అభినందించనున్నారు. రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై చర్చిస్తారు.
కీలక అంశాలు చర్చించే అవకాశం...
కాళేశ్వరం ప్రాజెక్టును... రికార్డు స్థాయిలో పూర్తిచేసిన విషయాన్ని ప్రధానికి వివరించి... ఆ ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించాలని మోదీని మరోసారి కోరనున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో కలిసి.. గోదావరి జలాలను... శ్రీశైలం వద్ద కృష్ణానదికి తరలించేందుకు చేస్తున్న యత్నాలను వివరించి, గోదావరి, కృష్ణా అనుసంధానానికి కేంద్రం నుంచి సహకరించాలని విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్రంలోని రహదార్లకు సంబంధించి ప్రధానితో చర్చించనున్న కేసీఆర్... ఇప్పటికే చేపట్టిన జాతీయ రహదారులు సహా హైదరాబాద్ చుట్టూ తలపెట్టిన ప్రాంతీయ వలయ రహదారిపై చర్చిస్తారు. జాతీయ రహదారిగా గుర్తించి ప్రాంతీయ వలయ రహదారి నిర్మాణానికి కేంద్ర ఉపరితల రవాణాశాఖ గతంలోనే సూత్రప్రాయంగా అంగీకరించిన విషయాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్లనున్న కేసీఆర్... అందుకు తుది ఆమోదం ఇవ్వాలని కోరనున్నారు.
మిషన్ భగీరథపై ప్రత్యేక చర్చ...
ప్రతి ఇంటికీ తాగునీరందించేందుకు కేంద్రం చేపట్టిన హర్‌ఘర్ జల్ పథకాన్ని మిషన్ భగీరథకు అనుసంధానించి... నిర్వహణ వ్యయాన్ని భరించాలని కోరే అవకాశం ఉంది. వెనకబడిన జిల్లాలకు నిధులు... ఆర్థిక మాంద్యంపైన ప్రధానితో చర్చించనున్నారు. ధాన్యం, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, ఎరువుల కోసం రేక్ పాయింట్ల పెంపు, కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న రిజర్వేషన్ల పెంపు, జోనల్ వ్యవస్థలో మార్పులు, విభజన చట్టంలో పేర్కొన్న హామీలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి చెందిన అంశాలపై చర్చించవచ్చని సమాచారం.
ఇదీ చూడండి: ఆ నగరంలో ట్రాఫిక్ జామ్ అయితే ఆనందమే!