CM KCR Delhi Tour Updates: తెలంగాణ రాష్ట్ర సమితి.. జాతీయ పార్టీగా అవతరించిన అనంతరం దిల్లీలో పార్టీ కార్యాలయ ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. రెండ్రోజుల ముందే హస్తినకు చేరుకున్న ముఖ్యమంత్రి .. సర్దార్ పటేల్ మార్గ్‌లో బుధవారం జాతీయ పార్టీ తాత్కాలిక కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. బీఆర్ఎస్ విజయవంతం కావడం, దేశం సుభిక్షంగా ఉండేందుకు దైవకృప కోసం రెండ్రోజులపాటు చేపట్టిన రాజశ్యామల యాగానికి గణపతి పూజతో శ్రీకారం చుట్టారు.
పుణ్యహవాచనం, యాగశాల ప్రవేశం, చండీ పారాయణం, మూలమంత్ర జపాలు జరగుతుండగా.. బుధవారం నవ చండీహోమం, రాజశ్యామల హోమం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాలు జరగనున్నాయి. సర్దార్‌పటేల్ మార్గ్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు కేకే, నామా, సంతోష్‌తోపాటు పార్టీ నేతలతో కలిసి జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవ ఏర్పాట్లతో పాటు యాగం కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై వారికి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు
రేపు బీఆర్‌ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం: భారత్ రాష్ట్ర సమితి తాత్కాలిక కార్యాలయాన్ని కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం 12గంటల 37నిమిషాల నుంచి 12గంటల 47నిమిషాల మధ్య ప్రారంభించనున్నారు. తొలుత పార్టీ జెండా ఆవిష్కరించనున్న ఆయన.. ఆ తర్వాత కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. ఎస్పీ అధినేత అఖిలేశ్‌యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, రైతు సంఘాల నాయకుడు రాకేశ్ టికాయత్‌తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ, రైతు సంఘాల నేతలు కార్యక్రమంలో పాల్గొననున్నట్లు బీఆర్‌ఎస్ నేతలు తెలిపారు.