Telangana Government Decision to regularize JPS : తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలంటూ సమ్మె చేసిన జేపీఎస్‌ల కలసాకారం కానుంది. వారి ఉద్యోగాల క్రమబద్దీకరణకు సీఎం కేసీఆర్ పచ్చజెండా ఊపారు. నాలుగేళ్ల శిక్షణా కాలాన్ని పూర్తి చేసుకున్న పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలను నిబంధనల మేరకు వారి పనితీరును పరిశీలించి, క్రమబద్దీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. జేపీఎస్‌ల క్రమబద్దీకరణపై సచివాలయంలో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర అభినందనీయమని ముఖ్యమంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామాలతో పోటీపడి తెలంగాణ పల్లెలు సాధించిన జాతీయ అవార్డుల్లో కార్యదర్శుల కృషి ఇమిడి ఉందని అన్నారు.
సాధించిన దానితో సంతృప్తి చెంది అలసత్వం వహించకూడదని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ పల్లెలు మరింతగా గుణాత్మక మార్పు చెంది, ప్రజల భాగస్వామ్యంతో ఇంకా అభివృద్ధి చెందే దిశగా పంచాయతీ కార్యదర్శుల నిరంతర కృషి కొనసాగుతూనే ఉండాలని ఆకాంక్షించారు. ప్రొబేషన్ పీరియడ్ పూర్తి చేసుకున్న కార్యదర్శుల పనితీరును జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలిస్తుందన్నారు.
నిర్ధేశించిన లక్ష్యాలను మూడింట రెండొంతులు చేరుకున్న వారిని క్రమబద్దీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం సంబంధించిన చర్యలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హన్మంతరావులను ముఖ్యమంత్రి ఆదేశించారు.