భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం తరఫు నుంచి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అనతికాలంలోనే అమూల్యమైన తీర్పులిచ్చి భారత న్యాయ చరిత్రలోనే కొత్త ఒరవడికి నాంది పలికారని జస్టిస్ రమణ సేవలను కొనియాడారు.
జస్టిస్ ఎన్వీ రమణ హుందాతనం, అంకితభావం రేపటి తరానికి ఆదర్శమని సీఎం కేసీఆర్ కితాబిచ్చారు. మరింతకాలం దేశానికి సేవలందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
1957 ఆగస్టు 27న ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని పొన్నవరం గ్రామంలో జస్టిస్ రమణ జన్మించారు. 1983 ఫిబ్రవరిలో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. 2000 జూన్ 27న ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. ఆ తర్వాత దిల్లీ హైకోర్టుకు చీఫ్ జస్టిస్‌గా వ్యవహరించారు. 2014 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. ఏప్రిల్ 24వ తేదీ నుంచి భారత దేశ 48వ ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నారు.
ఇదీ చూడండి:దేశ 'సర్వోన్నత' పీఠంపై తెలుగుతేజం