ప్రజలకు ఆహార కొరత రాకుండా చూసుకునే బాధ్యతను రాజ్యాంగం కేంద్రంపై పెట్టిందని.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తోందని సీఎం కేసీఆర్ (Cm Kcr Fire on Bjp) అన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం రోజుకో మాట చెబుతోందని విమర్శించారు. ధాన్యం విదేశాలకు ఎగుమతి చేసే అధికారం రాష్ట్రాలకు లేదని.. ధాన్యం సేకరణ, నిల్వ, ఎగుమతి వంటి అంశాలు కేంద్రం పరిధిలో ఉన్నాయన్నారు. రైతులతో పంట మార్పిడి చేయించాలని కేంద్రమే చెప్పిందన్నారు. ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో... ధాన్యం సేకరణ, పంటల సాగు, పెట్రో ధరలపై సీఎం కేసీఆర్ మాట్లాడారు.
కేసీఆర్‌ను జైలుకి పంపిస్తారా? ముట్టి చూడు బిడ్డా!
‘‘కేసీఆర్‌ను జైల్లో పెడతామని బండి సంజయ్ అంటున్నారు. కేసీఆర్‌ను జైలుకు పంపే దమ్ము భాజపా నేతకు ఉందా? కేసీఆర్‌ని టచ్ చేసి చూడు.. బతికి బట్టకడతావా? మీరు ధర్నాలు చేయడం కాదు.. రేపట్నుంచి మేం ధర్నాలు చేస్తాం. ఉత్తర భారత రైతులకు మద్దతుగా ధర్నా చేస్తాం. సాగు చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తాం. కేంద్రంపై పోరాడుతున్న రైతులకు అండగా ఉంటాం. ఉత్తర భారత రైతులకు మద్దతుగా ధర్నాలు చేస్తాం. దిల్లీ భాజపా వరి వేయెద్దని అంటోంది... ఇక్కడ సిల్లీ భాజపా వరి వేయాలని చెప్తోంది. కేంద్రం వరి ధాన్యం కొంటుంటే నేను వద్దన్నానా? వరి కొంటామంటూ కేంద్రం నుంచి భాజపా నేతలు లేఖ తేవాలి. వానాకాలం ధాన్యం మొత్తం కొనే వరకు భాజపాను నిద్రపోనివ్వను.
పెట్రోల్ ధరలు పెంచిన వాళ్లే తగ్గించాలి: కేసీఆర్
పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం అద్భుతంగా అబద్ధాలు చెబుతోంది. కేంద్రం రాష్ట్రాల వాటా ఎగ్గొడుతూ సెస్ పెంచింది. ఈ ఏడేళ్లలో క్రూడాయిల్ ధర ఎప్పుడూ 105 డాలర్లు దాటలేదు. బ్యారెల్ ధర 30 డాలర్లు ఉన్నప్పుడు కూడా భారీగా ధర పెంచారు. కేంద్రం రాష్ట్రాల వాటా ఎగ్గొడుతూ సెస్ పెంచింది. దేశంలో జరిగిన ఉప ఎన్నికల్లో భాజపాను ప్రజలు దెబ్బకొట్టారు. అందుకే కొండంత పెంచిన పెట్రో ధరలను పిసరంత తగ్గించారు. భాజపా నేతలు అడ్డగోలుగా మాట్లాడితే ఇకపై సహించం. ప్రజలను తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడితే చీల్చి చెండాడుతాం. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు అన్ని విధాలుగా పోరాడుతాం. పెట్రోల్. డీజిల్‌పై మేము నయా పైసా పెంచేది లేదు. రాష్ట్రంలో వ్యాట్ ఒక్క రూపాయి కూడా పెంచేది లేదు, తగ్గించేది లేదు. చమురుపై కేంద్రం విధిస్తున్న సెస్‌ను రద్దు చేయాలి. పెట్రోల్ ధరలు పెంచిన వాళ్లే తగ్గించాలి. పెట్రోల్ ధర పెంపునకు కారణమైన వాళ్లను నిలదీస్తాం. చమురుపై కేంద్రం విధిస్తున్న సెస్‌ను రద్దు చేయాలి’’ అని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు.
ప్రభుత్వ చర్యల వల్ల వ్యవసాయ స్థిరీకరణ..
యాసంగిలో వరి పంట వేయకుండా ఇతర పంటలు వేయాలని నిన్న వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. రైతులు నష్టపోతారనే ఉద్దేశంతోనే మంత్రి వివరించారు. కారణం ఏమిటంటే.. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయనంటోందని స్పష్టంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పడు రైతుల ఆత్మహత్యలు, వలసలతో రాష్ట్రం కకావికలమైన పరిస్థితి ఉండేది. తెరాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థిరమైన లక్ష్యంతో, నిర్ణయాత్మక పద్ధతిలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలని నిర్ణయించుకున్నాం. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం బలమైన అడుగులు వేసింది. ఆ ప్రక్రియలో మొదటి దశగా భూగర్భ జలాలను పెంచేందుకు మిషన్ కాకతీయలో భాగంగా చెరువులను అభివృద్ధి చేశాం. ఆ తర్వాత నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేశాం. ఆ తర్వాత ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ.10వేలు ఇచ్చాం.
చిన్న రైతులు చనిపోతే ఆ కుటుంబాలు రోడ్డున పడతాయని రూ.1,400 కోట్లు వెచ్చించి.. రైతు బీమా పథకం ద్వారా రైతుల ప్రీమియం కూడా చెల్లిస్తున్నాం. విత్తనాలు కూడా దొరికేవి కావు, కల్తీ విత్తనాలు అమ్మేవారు. కేంద్రంతో పోరాడి, ఒప్పంచి కల్తీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్టు తెచ్చాం. ఎరువులు దొరికేవి కావు. పోలీస్ స్టేషన్‌లలో పెట్టి ఎరువులు అమ్మిన సందర్భాలు ఉన్నాయి. అప్పటికీ ఇప్పటికీ ఎరువుల వినియోగం 3 రెట్లు పెరిగింది. అయినా, ప్రస్తుతం రాష్ట్రంలో ఎరువుల కొరత లేకుండా చేశాం. ఇలా అనేక చర్యలు చేపట్టాం. దీంతో అద్భుతమైన వ్యవసాయ స్థిరీకరణ జరిగింది. కరోనా విపత్తు కాలంలో నెలల తరబడి రాష్ట్రంలో పండిన ధాన్యం సంపూర్ణంగా కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి మంచి లాభం జరుగుతుంది. రెండు పంటలు పండించుకోవచ్చు. నువ్వులు, పెసర్లు వేయొచ్చు. వరికంటే ఎక్కువ డబ్బులు వస్తాయి.