CM KCR on Manish Sisodia Arrest: లిక్కర్ స్కామ్ వ్యవహారంలో దిల్లీ ఉప ముఖమంత్రి మనీశ్ సిసోదియా అరెస్టును బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోదీ, అదానీ సంబంధాలపై ప్రజల దృష్టి మరల్చేందుకే మనీష్ సిసోదియాను అరెస్టు చేశారని కేసీఆర్ ఆరోపించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ట్విటర్, కేసీఆర్ ఫేస్‌బుక్ ఖాతా ద్వారా స్పందించారు.
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించడం మొదటిసారి కావడం గమనార్హం. కూతురు ఎమ్మెల్సీ కవితపైనా విమర్శలు వెల్లువెత్తినప్పుడూ సీఎం కేసీఆర్ నేరుగా స్పందించలేదు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కేయాలని చూస్తోందని బీఆర్ఎస్ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. విపక్షాలపైనా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే దిల్లీ డిప్యూటీ సీఎంను సీబీఐ అరెస్టు చేసిందని ఆరోపణలు చేస్తోంది.
ఓటమి జీర్ణించుకోలేకనే సిసోదియా అరెస్టు : సిసోదియా అరెస్టుపై బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహకుడు అధ్యక్షుడు కేటీఆర్ ఇప్పటికే స్పందించారు. కేంద్రంపై తరచూ తనదైన శైలిలో ఆరోపణలు గుప్పించే మంత్రి కేటీఆర్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి జీర్ణించుకోలేకే సిసోడియాను అరెస్టు చేశారని.. విపక్షాలపై ఏజెన్సీలను ఉసిగొల్పుతున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ విషయంపై దేశవ్యాప్తంగా చర్యలు చేపట్టే యోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది.