CM KCR on Kashmir Files: 'కశ్మీర్ ఫైల్స్' సినిమా ద్వారా సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాల ద్వారా విష ప్రచారానికి తెరతీసి.. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఉపయోగపడే సినిమాలు తీయాలి కానీ ఇలాంటి విభజన రాజకీయాలు తగదని హితవు పలికారు. తెరాస శాసనసభాపక్ష సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. ఈ వ్యాఖ్యలు చేశారు.
దిక్కుమాలిన వ్యవహారం
"పురోగమిస్తున్న దేశంలో.. ఇరిగేషన్ ఫైల్స్, ఎకనామిక్ ఫైల్స్, ఇండస్ట్రియల్ ఫైల్స్ లాంటి సినిమాల ద్వారా ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉంది. కానీ ఈ కశ్మీర్ ఫైల్స్ ఏంటో.. ఈ దిక్కుమాలిన వ్యవహారం నాకర్థం కావట్లేదు. దీనివల్ల ఎవరికి లాభం.? దేశ విభజన చేసి.. ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టే కుట్రలు జరుగుతున్నాయి. ఇలాంటి వాటిని తెలంగాణ ప్రజానీకం సహించదు." -కేసీఆర్, ముఖ్యమంత్రి